అమ్మ కోరిక ... పాపం బ్రహ్మయ్య ...

పరుగుల జీవితంలో చాలా వదిలేశాము. అందులో విలువలు, ప్రేమాభిమానాలు, నిజమైన లక్ష్యాలు తదితర అనేకం ఉన్నాయి. క్షణం ఆగితే అవన్నీ గుర్తుకు వస్తాయేమో అనే భయమో లేక ఆఖరి క్షణాన్ని కూడా రూపాయిగా మార్చి తరువాత తరాలకు ఇచ్చి, త్యాగమూర్తి అని వాళ్ళచేత అనిపించుకోవాలనో.. ఎందుకో ఈ పరుగు కనీసం నీకోసం..నువ్వు కూడా కరువయ్యావేమో ఒక్క క్షణం ఆగి చూడు. నీకు నువ్వే లేనప్పుడు ఇంకా ఎవరి కోసం ఉండగలవు, ఎవరికి ఏమి చేయగలవు..!
లేనిపోని సాకులు తప్ప నీకైనా ఈ పరుగులు ఎందుకో తెలుసా..! తెలిస్తే నీకు ఎవరు ఉన్నారు, ఎవరికి నువ్వు కావాలో అవగాహన ఉందా.. ఇవన్నీ ప్రాథమిక స్థాయి ప్రశ్నలే. వీటికైనా సమాధానం స్పష్టంగా ఇవ్వగలిగితే కొంత సరిగా ఉన్నట్టే. లేకపోతే నీ పరుగుకు లక్ష్యం లేదని అర్ధం. అందుకే పెద్దలు రోజులో నీకోసం కాస్త సమయం గడపాలి అన్నారు. అలా గడిపే సమయంలో పై ప్రశ్నలు సహజంగా తలెత్తుతాయి, అప్పుడు వాటికి సమాధానం దొరుకుతుంది, తద్వారా జీవితంలో ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.
ఒక స్థాయి తరువాత నీకంటూ సమయం కేటాయించుకున్నా ప్రయోజనం ఉండదు. ప్రాథమిక స్థాయి నుండే రోజు చేసే పనులలో 'నీకోసం సమయం కేటాయించడం' అనే దానికి కాస్త స్థానం కల్పించాలి. అప్పుడు సహజంగానే అన్నీ సర్దుకుపోతాయి. లేదంటే, అంతా తిరగబడ్డట్టే ఉంటుంది. ఒక్కసారి తారుమారైన తరువాత వెనక్కి రావటం చాలా కష్టం. ఆ స్థితిని దాటలేక ఇటీవల చాలా మంది ఆత్మహత్యలు వంటి వాటికి పాల్పడటం చూస్తూనే ఉన్నాము.
ఇలాంటి పరిస్థితి ఒకసారి అమ్మకు కూడా వచ్చిందట. అందరికి వండివార్చడం, వాళ్ళు తృప్తి పడితే చాలు తాను ఆనందపడటంతో సరిపెట్టుకునేదట అమ్మ. అలా ఉండిఉండి ఒకరోజు పనైపోయాక కాస్త సమయం దొరకడంతో ఎందుకో తన గురించి ఆలోచించడం మొదలుపెట్టిందట. ఆ ఆలోచనలలో తాను చేస్తున్న కొన్ని విషయాలకు చాలా భయం వేసిందట. అప్పుడు దేవుడికి ఇలా ప్రార్దించిందట "స్వామీ అందరికోసం తాపత్రయపడి పడి ఈ గుండె చాలా అలసిపోయింది, ఇక అమ్మగా నా వల్ల కాదు, నన్ను మగాడిగా పుట్టించు".  దేవుడికి కూడా అమ్మ అంటే ఎంత ప్రేమాభిమానాలు, భయభక్తులంటే వెంటనే బ్రహ్మ దగ్గరకు వెళ్లి అమ్మ రాగానే ఈసారి అబ్బాయిలా పుట్టుక ఇవ్వు అని ఆజ్ఞాపించి వెళ్ళాడట. బ్రహ్మ కూడా అమ్మపై, దేవుడిపై ఉన్న గౌరవంతో అమ్మ రాగానే అబ్బాయిలా మళ్ళీ భూమిపైకి  పంపాడట. అప్పుడే దేవుడు వచ్చి, ఏమయ్యా చెప్పిన పని చేశావా అని బ్రహ్మను అడిగాడట, చేశాను అన్నాడట. హమ్మయ్య అనుకున్న దేవుడికి, ఎందుకైనా మంచిదని ఇంకో ప్రశ్న ద్వారా మళ్ళీ స్పష్టంగా కనుక్కుందాం అని, అమ్మను పూర్తిగా అబ్బాయిల మార్చావా అని అడిగాడట. అప్పుడు బ్రహ్మ నీళ్లు నములుతూ, స్వామి అంతా మార్చాను కానీ, పొరపాటున అమ్మ మనసు అలాగే ఉంచి భూమిపైకి పంపాను అని జవాబు ఇచ్చాడట. అసలు ఆ మనసు బాధ పడలేకనే కదా అమ్మ అబ్బాయిలా పుట్టాలి అనుకుంది, అదే మార్చడం మర్చిపోయావా..ఇప్పుడు కింద కెళ్లిన అమ్మ ఏమంటుందో అనే భయంతో ఆ ఇద్దరు తలలు పట్టుకున్నారట.
ఇలా కొన్ని సార్లు మన పయనం ఎందుకో కూడా తెలియనంత హడావుడి పడిపోయి కనీస విషయాలు మరిచిపోతే, అమ్మకు కూడా విసుగు వచ్చి ఆమె మనసు కూడా విరిగిపోతుంది. అప్పుడు మనల్ని ఎవరు కాపాడలేరు. అమ్మ లేని లోటు ఎవరూ పూడ్చలేరు. అందుకే ఎంత బిజీగా ఉన్నా మనకోసమే బ్రతికే వాళ్ళకోసం కాస్త సమయం కేటాయించడం చాలా అత్యవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: