కృష్ణాష్ఠమి : వెన్నదొంగ.. దొంగ కాదండోయ్..

దశావతారాలలో ఒకటైనా కూడా పుట్టుకతోనే కష్టాల కొలిమిలో నుండి వచ్చిన వాడు కృష్ణుడు. అందుకే అనిపించుకుందేమో పరిపూర్ణ అవతారం. గత అవతారాలన్నీ ఒక ఎత్తు ఇది ఒక్కటే ఒక ఎత్తు. మిగిలిన అవతారాలన్నీ దీనిలో కలిసినందుకు కూడా పరిపూర్ణం అయ్యిందని భాగవతాది గ్రంథాలు చెప్పాయి. రాక్షస సంహారం కోసమే మిగిలిన అవతారాలు వచ్చాయి. ఈ అవతారానికి మాత్రం అది పసిప్రాయం నుండే మొదలైంది. అందుకేనేమో పుట్టుకతోనే ఎన్నో ఇబ్బందుల మధ్య జన్మించినప్పటికీ, చేరాల్సిన చోటుకు చేరిన క్షణం నుండే రాక్షస సంహారం ప్రారంభించాడు. పసిపాపను ఎవరు చూసినా ముద్దుచేయక మానరు, వధించడానికి వచ్చిన రాక్షస మూకలు కూడా చిన్ని కృష్ణుడిని చూసి ఒక్క క్షణం వచ్చిన పని మరిచిపోయేవారని పురాణాలు చెపుతున్నాయి. ఆ క్షణ కాలం వాళ్ళు తన్మయత్వంతో బ్రహ్మపదార్దాన్ని చూసినందుకే చిన్ని కృష్ణుడు వాళ్ళని వాదించి, మోక్షాన్ని ప్రసాదించాడని చెపుతారు.


ఏ ఇతర అవతారాలలో లేని అద్భుత లీలలు చిన్ని కృష్ణుడు చేసి, బృందావన వాసులని అనుక్షణం ఆశ్చర్యానికి గురిచేసేవాడు. ఇన్ని చేస్తున్నా తల్లి యశోదకు మాత్రం సామాన్య పసికందు మాదిరి కనిపిస్తూ మురిపించేవాడు. చిన్నికృష్ణుడి లీలలు చెప్పుకుంటూ పోతే వాటికి అంతే ఉండదు, అన్ని లీలలు చేసేశాడు. భాగవతంలో ఈ లీలలు చదువుతున్న వారికి తెలియకుండానే మనసులో ప్రశాంతత ఆవరిస్తుందనేది ఎందరో స్వయంగా అనుభవించి చెప్పే నిజమైన అనుభూతులు. వీటిలో అందరిని అలరించేవి ప్రధానంగా కొన్ని చెప్పుకోవచ్చు. అందులో ఒకటి వెన్న దొంగతనం చేస్తూ గోపికలను ఏడిపిస్తూ ఉండటం. కృష్ణుడిని చూసిన గోపికలు చూపు తిప్పుకోలేకపోయేవారట, అంత ఆకర్షణ ఆ ముఖంలో ఉండేది. గోపికల విషయానికి వస్తే, రామాయణంలోకి ఒక్కసారి తొంగిచూసి రావాల్సిందే, రాముడిని గురించి వర్ణించేప్పుడు కూడా మహా గొప్పగా చెబుతారు, మగవారు ఆయనను చూసినా చూపుతిప్పుకోలేకపోయేవారట, అంతటి ముఖ వర్ఛస్సుతో ఉండేవాడు రాముడు. అలా ఆకర్షణకు లోనైనవాళ్లలో మహర్షులు, ఋషులు కూడా ఉన్నారని ధర్మగ్రంధాలలోనే చెప్పారు. వీరందరూ ఒక్కసారి రాముడిని స్పర్శించాలని కోరగా, ఇప్పుడు కుదరదు, కృష్ణావతారంలో తమ కోరిక తిరగలదని వరమిచ్చాడట. ఆ వరం ప్రకారమే బృందావనంలో ఉన్న గోపికలు, గోవులు అంతా మహర్షులు, ఋషులే అని ధర్మగ్రంధాలు చెపుతున్నాయి. 


ఇక వెన్న దొంగతనం గురించి వస్తే, దీని గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అయితే ధర్మ గ్రంధాల ప్రకారం అయితే, కృష్ణుడు వెన్న దొంగ కాదని, ఆ వెన్న అక్కడి సత్పురుషుల స్వచ్ఛతకు నిదర్శనమని, దానిని ఆయన సొంతం చేసుకునే ఒక ఆధ్యాత్మిక విషయమని చెప్పబడింది. కానీ ప్రస్తుతం ప్రచారంలో మాత్రం కృష్ణుడు గోపిలోలుడని, దొంగ అని చెప్పుకుంటూ ఉండటం శోచనీయం. హాస్యానికైనా తనను తలుచుకుంటే ఆ ప్రాణిని, ఆతడి వంశాన్ని, ఆతడి చుట్టూ ఉన్నవారి వంశాలను రక్షణ ఇవ్వాలని బ్రహ్మపదార్థం యొక్క నియమాలలో ఒకటి. అందుకే హాస్యానికి ఈ ప్రచారాలు పనికొస్తున్నాయి అని సరిపెట్టుకోవచ్చు కానీ అది నిజాలు మాత్రం కాదని ఇప్పటికైనా తెలుసుకోవడం ప్రతి భారతీయుడి కనీస ధర్మాలలో ఒకటి. ధర్మసంస్థాపనకు మాత్రమే అవతారాలు వచ్చాయి, మరో పరమార్థం లేదు. ఇది అందరూ గ్రహించి, కృష్ణాష్ఠమి జరుపుకోగలరు. ధర్మో రక్షతి రక్షితః

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: