సాంప్రదాయం అంటే.. పండక్కి పట్టు బట్టలేనా..

ఒక దేశంలో పుట్టి, పెరిగినప్పుడు అక్కడి విషయాలు కొన్ని సహజంగానే మనసు నుండి శరీరం వరకు ఆకళింపు అవుతాయి. పుట్టిన దేశాన్ని బట్టి కట్టు, బొట్టు అన్నారు పెద్దలు. అలా ఏదేశంలో అయినా మార్పులు పెద్దగా లేవనే చెప్పాలి. ఎందుకంటే అక్కడివారికి వారి జన్మభూమిపై ఉన్న నియమ నిబద్ధతలు అటువంటివి. నిజానికి కట్టుబొట్టు కంటే ఈ నియమ నిబంధనలే సహజంగా మనిషిని లేదా పౌరుడిని ఆ దేశం వాడిగా గుర్తించడానికి వీలు కలుగుతుంది. అందుకే అవి కూడా సాంప్రదాయం కిందకే వస్తాయి. పాశ్చాత్యులు చాలా మంది భారతదేశం వైపు ఆకర్షితులు అవుతున్నారు, కారణం ఇక్కడ ఉన్న విలువలు. ఈ విలువలు కూడా సాంప్రదాయం కిందకే వస్తాయి. అందుకే వారందరు భారతదేశం వచ్చి మరి వాటిని నేర్చుకుని, వారి వారి జీవితాలలోకి ఆకళింపు చేసుకుంటున్నారు.



కానీ ఇక్కడి వారు మాత్రం పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులై సొంత విలువలు మరిచిపోయి పండగలు వస్తే పట్టు వస్త్రాలు ధరిస్తే చాలు, అదే సాంప్రదాయం అనుకుంటూ కాలక్షేపం చేసేస్తున్నారు. ప్రపంచంలో భారతానికి ఉన్న స్థానం చాలా ఉన్నతమైనది. అంతటి స్థానాన్ని ప్రాంతీయులు మాత్రం తేలికగా తీసుకోవడం శోచనీయం. పొద్దున్న లేస్తే ఎందుకోసం పరుగులు పెడుతున్నామో కనీస అవగాహన కూడా లేకుండా ఖాళీ లేదు అనే పదాన్ని చెప్పుకుంటూ తిరిగేస్తున్నారు. ఈ నిర్లక్ష్య ధోరణికి పునాథి ఎక్కడ పడిందో ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేకుంటే తరువాత తరాలు పండక్కి కొత్త బట్టలే సాంప్రదాయం అని అనుకునే రోజులు వచ్చేస్తాయి..ఇప్పటికే ఈ పరిస్థితి కొంత మేర ఆవరించి ఉండవచ్చు. ముఖ్యంగా పట్టణాలలో ఇదే వాతావరణం మనకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. 



మన గురించి చెప్పమని ఏదైనా ఇంటర్వ్యూ కి వెళ్ళినప్పుడు ఎంత గొప్పగా చెప్పుకుంటామో అంతే గొప్పగా మనదేశం గురించి కూడా తెలుసుకొని తీరాలి, సందర్భం వచ్చినప్పుడు గళమెత్తి చెప్పాలి. ఇది ఒక భారతీయుడి కనీస బాధ్యతలలో ఒకటి. ఆ మాత్రం కూడా చేయకపోతే భారతీయుడిగా ఉండటం లేదా అనిపించుకోవడం అనే అర్హతలు పరీక్షించుకోవాల్సిన పరిస్థితులు వచ్చేస్తాయి. ఇక్కడ పుట్టిన వారందరు భారతీయులే కావచ్చు, కనీస అర్హతలు సంపాదించుకోకుండా భారతీయులుగా చలామణి అవడం కూడా అదోరకమైన దేశద్రోహమే అవుతుంది. ఎందుకంటే, తాతల ఆస్తి తిని కూర్చునే వాడికి మరియు సొంత కాళ్ళమీద నిలబడ్డ వాడికి తేడా ఉంటుంది కదా మరి. ఇవన్నీ కూడా సాంప్రదాయంలో భాగాలే, కేవలం కట్టుబొట్టు మాత్రమే కాదు. ఒక స్వీయ క్రమశిక్షణ లేని పౌరులు ఉన్నంత కాలం ఆ దేశం అభివృద్ధి చెందటం కలగానే మిగిలిపోతుందని ఓ పెద్దాయన ఎప్పుడో అన్నది అప్పుడప్పుడు గుర్తుచేసుకుందాం. చిన్న చిన్న ట్రాఫిక్ నిబంధనల నుండి పెద్ద పెద్ద ఎన్నికలలో ఓటు వినియోగించుకునే వరకు అన్నిటిలో స్వీయ క్రమశిక్షణ పాటించడమే నిజమైన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం పాటించినప్పుడు దేశ సాంప్రదాయం దానంతట అదే ఇనుమడిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: