బుడుగు: పిల్లలు కూరలు అస్సలు తినట్లేదా.. అయితే ఇలా చేయండి..!

N.ANJI
నేటి సమాజంలో పెద్దవారిదే కాదు.. చిన్న పిల్లల తిండి కూడా మారిపోయింది. ఇక పిల్లలు ఐదు సంవత్సరాల నుండే నూడిల్, పిజ్జాలు అంటున్నారు. రోజూ వేపుళ్లూ, బేకరీ పదార్థాలు లేనిదే ముద్ద దిగదని మారం చేస్తున్నారు. ఇదేమంత మంచి అలవాటు కాదని అందరికీ తెలుసు. కానీ ఏం చేస్తాం. గారాల పిల్లలు కదా. కాకపోతే ఆ పనికిమాలిన తిండి తిని వారు లావైపోతున్నారనీ, డయాబెటిస్ వంటి రోగాలకు సిద్ధపడుతున్నారనీ తెగ బాధపడిపోతుంటాం. పిల్లలతో మంచి పోషకాహారాన్ని తినిపించే చిట్కా ఒకటి కనుక్కొన్నామని చెబుతున్నారు పరిశోధకులు.
అయితే పిల్లలకి ఇష్టమైన ఆహారాన్ని అందిస్తూనే, వాటిలో ఉడికించిన కూరగాయల ముక్కలు కలిపితే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చింది నిపుణులకి. అయితే ఇలా చేయడం వల్ల పిల్లలు ఆహారం రుచి మారిపోతుందనీ, పిల్లలు ఆ కాస్త ఆహారాన్ని కూడా తినరని కొందరు వాదించారు. దాంతో ఈ చిట్కా పిల్లల మీద ఏ మేరకు పనిచేస్తుందో తెలుసుకోవాలనుకున్నారు.
ఇక ఒక 39 మంది పిల్లలకి మూడు రోజులపాటు వారికి ఇష్టమైన ఆహారంలో కాయగూరలను ఉడికించి అందించారు. ఈ పిల్లలంతా కూడా 3 నుంచి 6 ఏళ్ల లోపువారే. వీరికి ఇష్టమైన బ్రెడ్డు, పాస్తా, చికెన్ నూడుల్స్ లాంటి పదార్థాలలో కూరగాయలను కలిపి ఇచ్చారు. ఆశ్చర్యంగా పిల్లలు ఎలాంటి తేడా లేకుండా ఎప్పటిలాగే శుభ్రంగా ఆ పదార్థాలని తినేశారు. ఇలా పిల్లలకి ఇష్టమైన ఆహారంలో ఉడికిన కూరలను కలపడం వల్ల, వారి రోజువారీ ఆహారంలో కూరగాయల శాతం రెట్టింపు అయ్యిందట. అంతేకాదు! ఇలా కూరగాయలు తినడం వల్ల వాళ్లు చిరుతిళ్ల జోలికి పోవడం కూడా తగ్గిపోయిందట.
అంతేకాదు.. పిల్లలు కేవలం కెలొరీలు మాత్రమే అందించే తిండి తింటున్నారు అని వాపోయేకంటే ఇలాంటి చిట్కాలు పాటించమని సూచిస్తున్నారు నిపుణులు. వారికి స్నాక్స్తో పాటుగా కూరగాయల ముక్కలు పెట్టడం, ఇష్టమైన ఆహారంలో కూరలు వేయడం, ఉడికించిన కూరలతోనే రుచికరమైన పదార్థాలు వండే ప్రయత్నం చేయడం... లాంటి ఉపాయాలతో ఎలాగొలా పిల్లలకి తగినన్ని కూరలు అందేలా చూడమని హెచ్చరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: