బుడుగు: పిల్లలు వాంతి చేసుకుంటున్నారా.. ఇలా చేయండి..!?

N.ANJI
సాధారణంగా పిల్లలు ఎదుర్కొనే ఇబ్బందులలో వాంతులు ఒకటి. ఇక చిన్నపిల్లలు వాంతులు చేసుకోవడం సహజమే అయినప్పటికీ... వాంతులు రెండు రకాలుగా ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఒకటి ఆహారం పదార్థాల వల్ల కలిగేవైతే.. రెండోది, అనారోగ్యం వల్ల కలిగేవి. ఏవి అనారోగ్యం వల్ల వచ్చే వాంతులన్న విషయాన్ని గుర్తించగలిగితే, వాటివల్ల అనర్థాల నుండి తప్పుకోవచ్చు.
పిల్లలకు పాలు పట్టిన తరువాత త్రేన్పు వచ్చేదాకా భుజంపై వేసుకుని మెల్లగా తట్టాలి. అలా తట్టనప్పుడు పిల్లలు వాంతి చేసుకుంటారు. ఇవి సాధారణంగా వచ్చే వాంతులు. వాటితో పాటు విటమిన్ కె లోపం వల్ల, కొన్ని రకాలైన మందులు వాడటం వల్ల కూడా వాంతులు వస్తుంటాయి. శిశువు యొక్క కడుపు పూర్తిగా నిండినప్పుడు, ఆహారంతో పాటు జీర్ణ ఆమ్లాలు కూడా అతని ఆహార నాళం పై వైపుగా కదిలి, వాంతికి కారణమవుతాయి.
ఇక బిడ్డ పుట్టిన 23 రోజుల్లోగా తాగిన పాలలో మూడవ వంతు భాగం వాంతి చేసుకున్నట్లయితే, అది పూర్తిగా అనారోగ్యకరమైన సమస్యగా గుర్తించాలి. ఒక్కోసారి పాలతో పాటు పచ్చటి పసరు, రక్తం జిగురు కూడా వాంతితో పాటు వస్తుంటుంది.దీనికి కారణాలను పరిశీలిస్తే... కొందరు పిల్లల్లో చిన్న ప్రేగు అభివృద్ధి చెందక పోవడం, పిల్లల్లో పుట్టినప్పుడు తల్లి గర్భంలోని ఉమ్మనీరు త్రాగడం, సిజేరియన్ ఆపరేషన చేసినప్పుడు, కార్థికో స్టిరాయిడ్స్ వాడటం అయి ఉండవచ్చు.
అయితే పొట్ట ఉబ్బరంగా ఉండటం, కుండమాదిరిగా మెరుస్తుండటం, ఆయాసంతో రొప్పుతుండటం లాంటి లక్షణాలు పిల్లల్లో కనిపించినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ఒక్కోసారి మూత్రం విడుదల కాకుండా ఆగిపోయి ఉంటుంది. అలాంటప్పుడు కూడా వెంటనే డాక్టరు దగ్గరికి వెళ్ళాలి. వాంతి చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఊపిరి తిత్తుల్లోకి వెళ్లిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి, వెంటనే ఎక్స్‌రే తీయించాలి. ఉదర భాగాన్ని అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించాలి. నెలల పిల్లలకు ప్రత్యేకంగా తయారు చేసిన నియోనేటల్ ఎండోస్కోపీ పెట్టి చూడాలి. బిడ్డకు రక్త పరీక్ష ద్వారా ఇన్‌ఫెక్షన్ ఎంత మోతాదులో ఉందో గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: