బుడుగు: పిల్ల‌లకు ఈ నిబంధ‌న‌లు ఎక్కువ‌గా పెట్ట‌కూడ‌దు..?

Arshu
పిల్లల భవిష్యత్తు తల్లిదండ్రుల చేతుల్లోనే ఉంది. వారే దశ.. దిశ నిర్ధేశకులు. అమ్మానాన్నల నడవడికలు పిల్లల్లో పాతుకుపోతాయి. చెప్పే మాటలు.. చేసే పనులు.. ఇచ్చే సలహాలు.. భావోద్వేగాలు వారికి మార్గదర్శకాలవుతాయి.. అంటున్నారు నగరంలోని మానసిక నిపుణులు. పిల్లల పెంపకంపై వారు తల్లిదండ్రులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.

మీ పిల్లాడు అబద్దాలు చెబుతున్నారా.. ప్రతి విషయంలోనూ వెనకంజ వేస్తున్నారా..? మీరు చెప్పిన పనికి పూర్తిగా వ్యతిరేకంగా నడుచుకుంటున్నారా..? అయితే ఇలాంటి వాటికి ఒక లెక్క ఉంది. తల్లిదండ్రుల ప్రవర్తన, మంచి అలవాట్లు, ప్రేమాభిమానాలతో కూడిన పెంపకంలో తేడాలొస్తే ఫలితం ఇలానే ఉంటుంది. ముఖ్యంగా గారాబం చేస్తే వారి అభ్యున్నతికి ఆటంకం కలుగుతుంది.

ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు ఇది తినొద్దు.. అలా చేయొద్దు.. ఎలా చదువుతున్నావ్.. ఏం చేస్తున్నావ్..? అంటూ కఠిన నిబంధనలు విధిస్తే పిల్లల్లో సంతోషం లోపిస్తుంది. పిల్లలు గతి తప్పకుండా సున్నితంగా నచ్చచెప్పే విధంగా తల్లిదండ్రులు నడుచుకోవాలి.
ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంటే..

చేసిన తప్పులు ఎత్తిచూపుతూ జీవితంలో ఎప్పటికీ అంతే అని ప్రతి చిన్న విషయాన్ని భూతద్దం పెట్టి విమర్శలు గుప్పిస్తే వాళ్లలోని ఆశాభావం నీరుగారుతోంది. ఓటమి విజయానికి మెట్టు. ఎన్నిసార్లు ఓడిపోతే అంత గుణపాఠం నేర్చుకోవచ్చు. మళ్లీమళ్లీ పోరాడు.. అంటూ ఎప్పుడూ ప్రోత్సహించాలి. అప్పుడే ఓటమిని దిగమింగుకుని ప్రయత్నిస్తారు. అలా కాకుండా ఎప్పుడూ వాళ్లను చూడు ఎంత బాగా చదువుతున్నారో.. పక్కింటి వాడిని చూడు నిద్ర లేవగానే చదువుతున్నాడు.. నీకెందుకు తక్కువ మార్కులొచ్చాయి.. ఎదురింటి అమ్మాయికి చూడు అన్నింటిలో వంద మార్కులొచ్చాయి.. అంటూ ప్రతి పనికీ ఎదుటివారిని చూపించడం వలన పిల్లల్లో ఆత్మవిశ్వాసం సన్నగిల్లడమే గాకుండా అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తారు.

వీలైనంత వరకు వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు ప్రయత్నించాలి. తల్లిదండ్రుల చెప్పులు పిల్లలకు సరిపోతున్నాయంటే ఇక వారు స్నేహితులైనట్టే. పిల్లలు పెరిగే కొద్ది తల్లిదండ్రులు వారికి దగ్గరయ్యేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో తల్లి మరింత జాగ్రత్త తీసుకోవాలి. ఏదైనా చేస్తే అమ్మానాన్నలు కొడతారనే భావన రాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాచే ప్రయత్నం చేసే ప్రమాదం ఉంటుంది. తద్వారా అనేక సమస్యలు పుట్టుకొస్తాయి. అలా కాకుండా తప్పు ఏ స్థాయిలోదైనా అమ్మకు చెప్పేయాలనే భావన పిల్లల్లో కలగాలి. అమ్మాయైన, అబ్బాయైనా సరే ఇదే తరహా పద్ధతులను నేర్పించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: