తిప్పన్న- తిమ్మన్న

Durga
తిప్పన్నకు చాకిరేవే ప్రపంచం. ఊరందరి బట్టలూ ఉతికి గంపెడు సంసారాన్ని నెట్టుకొస్తున్నాడు . తిప్పన్న కొక గాడిదుంది దాని పేరు తిమ్మన్న. తిప్పన్న సంసారం పెరిగేకొద్దీ తిమ్మన్న బరువూ పెరుగుతూ వచ్చింది. అసలు ఒక్కమాటలో చెప్పాలంటే తిప్పన్న సంసారం బరువు తిమ్మన్న వీపుమీదుగా వెళ్లమారుతోంది ఒకరోజు తిప్పన్న బండెడు బట్టలుతికి అరేశి పొద్దువాలే వేళకి బట్టలన్నీ మూటలుకట్టి తిమ్మన్న మీద పేర్చాడు. ఎంతగాడిదైనా ఎన్నిమూటలని మోస్తుంది..? కానీ తిమ్మన్న బాధ తిప్పన్న కేమెరుక..? మూట మీద మూట రెండే గాడిదల బరువు ఒక్క గాడిదమీదే వేసి తను చిన్నమూట మాత్రం భుజాన వేసుకుని చేతులు ఊపుకుంటూ “చల్ చల్” అంటూ ముందడగు వేస్తాడు పాపం తిమ్మన్న మూలుగుతూ ముక్కుతూ ముందడుగు వేస్తుంది. కొంతదూరం పోయేసరికి భార్య అన్నమాట గుర్తొచ్చింది. “పోయిలోకి బొత్తిగా పుల్లలేవు. రోజూ ఏటికెళ్తావేగాని ఏనాడన్నా నాలుగు ఎండుకట్టెలు తెచ్చావా..? అని గొడవ వేసుకోసాగింది ఆ విషయం గుర్తువచ్చిన వెంటనే తిప్పన్న అటూ ఇటూ చూశాడు రోడ్డుపక్క ఎండి పోయిన చెట్టొకటి కనిపించింది.భుజానున్నమూటని తిమ్మన్న మీదికి విసిరి గబగబా వెళ్లి ఎండిన నాలుగు కొమ్మలు విరుచుకొచ్చి తిమ్మన్న మీద వేశాడు . తిమ్మన్న మూలిగింది “ఎండిన కొమ్మలేగా ఏమంత బరువులే పద” అన్నాడు. మరి నాలుగడుగులు వేసేసరికి ఆఖరబ్బాయి మాట గుర్తొచ్చింది. వాడికి తాటి పళ్ళంటే మహా ఇష్టం కదా అనుకుంటూ అటూ ఇటూ చూశాడు తాటిచెట్ల క్రింద పండిరాలిన నాలుగైదు తాటిపళ్ళు కనిపించాయి వాటిని కూడా మూటల్లో కుక్కాడు. తిమ్మన్న మళ్లీ మూలిగింది “తవ్వెడు తౌడు తింటావే, నాలుగు తాటికాయలు మొయ్యలేవూ..?” అని అదిలించాడు. పదడుగులు వేసే సరికి గట్టుమీద నవనవలాడుతూ పచ్చగడ్డి కనిపించింది. గడ్డి పరకలు చూడగానే మేకపిల్ల గుర్తొచ్చింది. గబగబా నాలుగు గుప్పెళ్లు పెరికి పిడికెంత మోపుకట్టి .. “ ఈ గడ్డిపరకలు కూడా బరువేనని మూల్గితే ఇక నీ పని అంతే..” అంటూ గడ్డిపరకల్ని కూడా తిమ్మన్న మిద వేశాడు. అప్పటికే అలసిపోయిన తిమ్మన్న పిడుగు పడ్డట్టు నేలకూలింది.. లబొదిబోమన్న తిప్పన్న తను చేశిన తప్పుకు బాధ పడుతూ బండెడు బరువుకు కుంగని గాడిద గుప్పెడు గడ్డి కింద ఎందుకు పడిందోనని ఆలోచిస్తూ ఆ బరువును మొత్తాన్ని ఎలా తీసుకెల్లాలలో అర్ధంకాక తలుపట్టుకూర్చున్నాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: