మన ఊరిలో ‘ఉగాది’ !

Durga
చిన్నారి అనుషాకు ఇంకా రాయటం రాదు-గానీ చాలా కథలు చెప్పటం వొచ్చు. ఒక రోజున ఆ పాప అడవిలో పోతుంటే, ఒక మేకపిల్ల ఎదురైంది. "మేకా మేకా, ఇక్కడెందుకు తిరుగుతున్నావ్, ఒక్కతివే? పో, మీ అమ్మ దగ్గరికి!" అన్నది అనుషా. "మా అమ్మ కోసమే వెతుక్కుంటున్నాను. ఎక్కడికిపోయిందో ఏమో; కనబడటమే లేదు" అన్నది మేకపిల్ల.  "సరే , అయితే నాతో రా" అని అనుషా దాన్ని వెంటబెట్టుకొని నడుస్తా పోయింది. ఎంత వెతికినా వాళ్లమ్మ కనబడలేదు! అంతలో రోడ్డు మీదికి ఒక బస్సువచ్చింది. అనుషాను చూసి ఆగిందది. దానిలో నిండా చాలామంది జనాలు, కోళ్లు, మేకలు , జీవాలు- అందరూ పోతున్నారు. "రా, పాపా! బస్సెక్కు, ఎక్కడికి పోవాలి?" అడిగారు వాళ్లు. "వీళ్ల అమ్మ దగ్గిరికి పోవాలి. ఎక్కడుందో, ఏమో?!" అన్నది అనుషా . వాళ్లు అన్నారు- "మేకలు ఉదయాన్నంతా ఎక్కడికి పోయినా రాత్రి అయ్యేసరికి ఊళ్లోకి వచ్చేస్తై గదా, అందుకని మీరూ వచ్చేసి ఊళ్లో ఉండండి. వీళ్ల అమ్మకూడా వస్తుంది లెండి" అని.  'సరే'; అని వీళ్లిద్దరూ బస్సెక్కి ఊళ్లోకి వెళ్లారు. ఊళ్లోకి రాగానే మేకపిల్లకు వుషారు వచ్చేసింది. "ఇదే- ఇదే మాఊరు!" అరిచిందది. "మా ఇల్లు చూపిస్తాను రా!" అని వెంటబెట్టుకుపోయింది అనుషాను. చూస్తే ఆ పాప ఆశ్చర్యపడిపోయింది: ఆ ఇల్లు చిన్న ఇల్లుకాదు - రాజుగారి ఇల్లులాగా పే...ద్ధగా ఉంది! దాని మధ్యలో చాలా చాలా మేకలు, గొర్రెలు , ఆవులు, అన్నీ చక్కగా తిరుగుతూ ఉన్నై!! ఒక పెద్దాయన వాటన్నిటికీ నీళ్లు పెడుతున్నాడు. మేకపిల్ల మందలోకి పరుగెత్తుకు పోయింది. అన్నింటికీ అటూఇటూ నెట్టుకుంటూ పోయింది. దాని వెనకనే అనుషా! చివరికి మేకపిల్ల వెతికీ వెతికీ వాళ్లమ్మను కనుక్కున్నది. "ఎక్కడికి పోయావే, నువ్వు!" అని కళ్లలో నీళ్లు కార్చుకుంటూ అమ్మ సంబరపడింది. "నువ్వెక్కడికి పోయావ్! నీ కోసం నేను అడివి అంతా వెతికాను" అని కళ్లనీళ్లు పెట్టుకొని అరిచింది మేకపిల్ల. కొంచెం సేపయ్యాక మేకమ్మ అనుషాని చూసి, "అయ్యో నువ్వేకదూ , మాపాపని బస్సెక్కించి ఇక్కడికి తీసుకొచ్చింది?! ఎంత మంచి పాపవు! ఏ ఊరు మీది?" అని అడిగింది. చక్కగా పెద్దగ్లాసుతో చాలా పాలిచ్చింది తాగమని. అనుషా అక్కడే నిలబడి పాలు తాగుతుంటే ఆ ఇంటాయన వొచ్చాడక్కడికి. అనుషాని చూడగానే కళ్ళు నులుముకొని చూసి - "చిన్నీ! ఒసే, చిన్నీ!! ఇక్కడికి ఎట్లావచ్చావే, ఒక్కతివే? ఏరీ, అమ్మా నాన్నా ఏరి?! అని అరిచాడు.  అదెవరనుకుంటున్నారు? సుబ్బయ్య తాతే! అనుషా పాలగ్లాసు అక్కడ పెట్టేసి ఒక్కదూకులో సుబ్బయ్య తాత చంక ఎక్కేసింది. అప్పటి వరకూ ఉన్న ధైర్యం ఎటుపోయిందో ఏమో, ఒకటే ఏడుపు- "వావ్...."అని. ఏడుపు మధ్యలోనే చెప్పింది: "అమ్మ తప్పిపోయింది- ఎటు - పోయిందో - తెలీదు" అని. దాని ఏడుపువిని బుజ్జి మేక ఏడ్చింది. వాళ్లమ్మ ఏడ్చింది. ఆవులు ఏడ్చాయి. జీవాలన్నీ ఏడ్చాయి. సుబ్బయ్య తాతయ్య మటుకు ఏడవలేదు. దాన్ని ఎత్తుకొని పోయి ఫోన్ చేశాడు - అనుషా వాళ్ల అమ్మకి. వాళ్లమ్మ పాపకోసం వెతుక్కుంటున్నది కదా, అది ఇక్కడుందని చెబితే తనూ ఏడ్చింది సంతోషం కొద్దీ. వెంటనే బయల్దేరి వొచ్చేశారు అందరున్నూ. అమ్మా, నాన్న అందరూ వచ్చారు, తెల్లారేసరికల్లా. "ఉగాది పండక్కి ఊరుకి రండమ్మా, అని ఎన్నిసార్లు చెప్పినా మీరెవరూ రాలేదు. చిన్ని పాప చూడు ఎంత మంచిదో ! చక్కగా తనే వొచ్చింది. తన నవ్వులతోటీ, ఏడుపుతోటీ మిమ్మల్నందర్నీ కూడా పిలుచుకొచ్చింది చూడండి!" అని సుబ్బయ్య తాత మురిసి పోయాడు. చిన్నితో పాటు అందరూ నవ్వుతుంటే తాత ఇంట్లో ఉగాది పండుగ వేడుకగా జరిగింది. వేప పూతా, కొత్తబెల్లమూ, కొత్త చింతపండూ, చిట్టి చిట్టి మామిడి పిందెలూ- అన్నీ వచ్చినై, పరుగు పరుగున. అటు తర్వాత ప్రతిసారీ అనుషా వాళ్ల ఉగాది సుబ్బయ్య తాత ఇంట్లోనే!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: