స్వాతంత్య్ర‌పోరాటంలో వినాయ‌క చ‌వితి పాత్ర‌..

Paloji Vinay
వినాయ‌క చ‌వితి కేవ‌లం ఒక ఆధ్యాత్మిక, మ‌త‌ప‌ర‌మైన పండుగ‌నే కాదు. కుల మ‌త బేధాల‌కు అతీతంగా ఈ పండుగ‌ను జ‌రుపుకుంటారు. అదే విధంగా స్వాతంత్య్ర పోరాటంలో భార‌తీయుల‌ను ఏకం చేయ‌డానికి వినాయ‌క చ‌వితి తోడ్ప‌డింది. బ్రిటీష‌ర్లు దేశాన్ని వారికి వీలైన‌ట్టు విభ‌జించి, ప్రాంతాల పేరుతో కొట్టుకునేట్టు చేసి స్వ‌రాజ్యం కోసం ఆలోచించకుండా చేసింది. స్వాతంత్య్ర పోరాటాన్ని అణ‌చివేయ‌డాని రాజ‌కీయ‌, మ‌త‌ప‌ర‌మైన స‌భ‌లు, స‌మావేశాలు, ప్ర‌జ‌లు గుంపుగా ఒకే చోట చేర‌డాన్ని నిషేధించింది బ్రిటీష్ గ‌వ‌ర్న‌మెంట్‌. అలాంటి సంద‌ర్భంలో 1890 నాటికే కాంగ్రెస్‌లోని అతివాదుల్లో ఒకరిగా, జాతీయోద్యమ కీలక నేతగా ఎదిగిన బాలగంగాధర్‌ తిలక్ ఓ ప్ర‌ణాళిక‌ను ప‌న్నాడు.

   అదే వినాయక చవితిని  జాతీయోద్యమానికి ముడిపెట్ట‌డం. ప్రజలందరినీ కులమతాలకు అతీతంగా ఏకం చేయటానికి చవితి వేడుకలను వేదికగా సృష్టించాడు. అప్పటిదాకా ఇళ్లకే పరిమితమైన వినాయ‌క చ‌వితిని వీధుల్లో మండ‌పాల్లో జ‌రపాల‌ని నిర్ణ‌యించాడు. దీంతో 1894లో తొలిసారిగా పుణెలో సార్వజనిక్‌ గణేశ్‌ ఉత్సవ్‌ పేరిట మండపాల్లో మట్టి వినాయకులను ప్రతిష్ఠించారు.  నవరాత్రులూ పూజ చేసి ఆ తర్వాత నిమజ్జనం చేసే సంప్రదాయం ప్రారంభ‌మైంది. గుడుల్లో కన్పించే అంటరానితనం కూడా ఈ మండపాల కారణంగా కనుమరుగు అయింది.

     వివిధ వీధుల్లో మండపాల ఏర్పాటుతో అన్ని కులాలు, వర్గాల ప్రజలు వీటిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్ర‌జ‌ల వ‌ద్ద‌కే భ‌గ‌వంతుడు రావ‌డంతో  నవరాత్రులూ ప్రజలు వేల సంఖ్యలో మండపాలకు వచ్చి భజనలు, కీర్తనలతో పాటు జాతీయోద్యమానికి సంబంధించిన పాటలు, ఉపన్యాసాలు కూడా చేసేవారు. ప్రజల్ని చైతన్య వంతులను చేయటానికి ఈ మండపాలు మంచి వేదికగా మారాయి జాతీయోద్య‌మ నాయ‌కుల‌కు. త‌రువాత ఈ ఉత్స‌వాలు బొంబాయ్ అనంత‌రం భార‌త‌దేశం మొత్తం విస్త‌రించాయి.


      ఈ ఉత్స‌వాల ద్వారా తెల్ల దొర‌లు హిందూ ముస్లీంల మ‌ధ్య హింస చెల‌రేగాల‌ని భావించి ఉత్స‌వాల‌కు అడ్డు చెప్ప‌లేదు. కానీ ఆ విధంగా జ‌ర‌గ‌కుండా తిల‌క్ త‌గిన చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో బ్రిటిష్ వారి ప్లాన్ ఫెయిల్ అవ‌డ‌మే కాకుండా వినాయ‌క ఉత్స‌వాల్లో ముస్లింలు కూడా పాల్గొన్నారు. మండ‌పాల‌కు కావాల్సిన సామాగ్రి, వాయిద్యాల‌ను ముస్లింలే స‌ర‌ఫ‌రా చేసేవారు. దీంతో హిందూ ముస్లీంల మ‌ధ్య ఐక్య పెర‌గడానికి వినాయ‌క చ‌వితి కార‌ణ‌మ‌యింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: