వామ్మో: వరుసగా మూడో రోజు లక్షన్నర కేసులు!

N.Hari
భారత్‌లో కరోనా మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతుండటంతో.. దేశంలో థర్డ్‌ వేవ్‌ పీక్‌ స్టేజ్‌కు చేరుతున్న పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వరుసగా మూడో రోజు లక్షన్నరకుపైగా కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో 1.60 లక్షల కొత్త కేసులు రికార్డు అయ్యాయి. పాజిటివిటీ రేటు 10.21 శాతానికి ఎగబాకడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
ప్రస్తుతం దేశంలో కొవిడ్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య 6 లక్షలకు చేరింది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు సైతం వేగంగానే పెరుగుతున్నాయి. దీంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కరోనా వైరస్‌ కట్టడిపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పలు సూచనలు ఇవ్వడంతో పాటు మార్గనిర్దేశనం చేశారు. థర్డ్‌వేవ్‌ ప్రభావంతో దేశవ్యాప్తంగా పెరుగుతోన్న కరోనా కేసులు, వైరస్‌ కట్టడి చర్యలు, వ్యాక్సినేషన్‌ వేగవంతం, మెడికల్‌ ఆక్సిజన్‌, ఔషధాల ముందస్తు నిల్వ, వైరస్‌ ఉద్ధృతిని ఎదుర్కొనేందుకు వివిధ శాఖల సంసిద్ధత తదితర అంశాలపై చర్చించారు.  మరీ ముఖ్యంగా ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా మోదీ సమీక్షించారు.
మరోవైపు దేశ రాజధాని ఢిల్లీలోనూ రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతున్నాయి. దీంతో వలస కూలీలు ఆందోళన చెందుతున్నారు. ప్రస్తుత వారాంతపు కర్ఫ్యూలు నెమ్మదిగా లాక్‌డౌన్‌కు దారితీసే ఛాన్స్‌ ఉందని భావిస్తున్నారు. ఈ భయంతోనే తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. గతంలో తాము ఎదుర్కొన్న కష్టాలను దృష్టిలో పెట్టుకుని తమ సొంతూళ్లకు వెళుతున్నట్లు వలస కూలీలు చెబుతున్నారు. కాగా కరోనా విజృంభిస్తున్నప్పటికీ లాక్‌డౌన్‌ను విధించే యోచన లేదని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ స్పష్టం చేశారు.
కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దివ్యాంగులు, గర్భిణులకు వర్క్‌ ఫ్రమ్ హోమ్‌ వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపింది. అలాగే కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న కంటైన్మెంట్‌ జోన్‌లలోని ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి కూడా వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ వెసులుబాటు ఇస్తున్నట్లు వెల్లడించింది. ఇక కరోనా థర్డ్‌ వేవ్ క్రమంలో వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేశారు. 12 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు పిల్లలకూ టీకా ఇస్తున్నారు. అలాగే హెల్త్‌ కేర్‌, ఫ్రంట్‌లైన్‌ వర్కర్‌లతో పాటు 60 ఏళ్లు పైబడి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి బూస్టర్‌ డోస్‌ వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: