కరోనా వచ్చిన వారికే ఓమిక్రాన్ వస్తుందట...!

Podili Ravindranath
ప్రస్తుతం ప్రపంచాన్ని వణికిస్తున్న ఒకే ఒక శత్రువు కరోనా వైరస్. రెండేళ్లుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంకా చెప్పాలంటే ప్రపంచం రెండు నెలల పాటు స్తంభించిపోయింది కూడా. ఎక్కడి వాళ్లు అక్కడే ఆగిపోయారు. ప్రజలు నానా పాట్లు పడ్డారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత... పరిస్థితి ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి చేరుతోంది. అయితే కరోనా మహమ్మారి మాత్రం తన రూపాన్నీ మార్చుకుని వైద్యులకు, శాస్త్రవేత్తలకు సవాల్ విసురుతూనే ఉంది. బీటా, డెల్టా వేరియంట్‌లతో కొవిడ్ - 19 ఇప్పటికే భయపెట్టింది. ఇప్పుడు తాజాగా ఓమిక్రాన్ వేరియంట్ ఆఫ్రికా దేశాల్లో పుట్టి... ప్రపంచాన్ని కమ్మేసింది. భారత్‌లో కూడా ఇప్పటికే 21 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఓమిక్రాన్ వేరియంట్ వల్ల తిరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉన్నట్లు క్లీనికల్ పరిశీలనల్లో కూడా వెల్లడైంది. ఇదే విషయాన్ని సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.
ప్రధానంగా కొవిడ్ నుంచి కోలుకున్న వారికే ఓమిక్రాన్ సోకే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించారు. సింగపూర్‌లో వ్యాక్సినేషన్ పూర్తి చేసిన 37 ఏళ్ల వ్యక్తికి ఓమిక్రాన్ వేరియంట్ సోకింది. ఇతను ఈ నెల ఒకటవ తేదీన దక్షిణాఫ్రికా నుంచి వచ్చినట్లు వెల్లడించింది. కొన్ని రోజులుగా తమ దేశానికి వచ్చిన వారి ట్రావెల్ హిస్టరీ పరీక్షించామన్నారు. అలాగే ఓమిక్రాన్ వేరియంట్ కేసులకు సంబంధించి నివేదికలను సమీక్షించామన్నారు వైద్యులు. అయితే వీటిల్లో ఎక్కువగా గతంలో కరోనా వచ్చిన వారికే మరోసారి ఓమిక్రాన్ వేరియంట్ వైరస్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. దీంతో ఓమిక్రాన్ వేరియంట్ గురించి మరింత అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందన్నారు వైద్యులు. అదే సమయంలో ఓమిక్రాన్ వేరియంట్‌పై వ్యాక్సిన్ల ప్రభావం ఎలా ఉంటుదనే అధ్యయనాలు కొనసాగుతున్నాయన్నారు శాస్త్రవేత్తలు. తీవ్రమైన అనారోగ్యం నుంచి ప్రజలను రక్షించడంలో ప్రస్తుత వ్యాక్సిన్లు సమగ్రంగా పని చేస్తున్నాయన్నారు. వ్యాక్సిన్ డోసులను ప్రతి ఒక్కరు తప్పని సరిగా వెంటనే తీసుకోవాలన్నారు. అలాగే బూస్టర్ డోసుల కోసం కూడా తొందర పడాలని సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: