గానుగ నూనె బెస్ట్... ఓల్డ్ ఈజ్ గోల్డ్...!!!
కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, కొండపల్లి ప్రాంతాల్లో గానుగ నూనెల దుకాణాలకు జనం క్యూ కడుతున్నారు. గానుగ నూనెల విశిష్టతను తెలుసుకొని మరి కొనుగోలు చేస్తున్నారు. అంతేకాకుండా పాలిష్ బియ్యం కోసం ఆరాటపడిన వారు కూడా ఇప్పుడు కొర్రలు, సజ్జలు, జొన్నలు అంటూ అవే పాత పద్దతులను అనుసరిస్తున్నారు. ఈ నేపధ్యంలో వినియోగదారుల అవసరాలను దృష్టిలో పెట్టుకొని గానుగ దుకాణం దారులు అన్ని రకాల గానుగ నూనెలు, ఇతర పోషక పదార్థాలు అందుబాటులో ఉంచుతున్నారు. గతంలో రిఫైండ్ ఆయిల్ కోసం వందల రూపాయలు ఖర్చు చేసిన వారు కూడా ఇప్పుడు తప్పు చేశామని భావిస్తున్నారు. రిఫైండ్ వద్దు... గానుగ ముద్దు అంటున్నారు. అటు గానుగ కేంద్రాల నిర్వాహకులు కూడా తమ దగ్గర అన్ని రకాల గానుగ నూనెలు అందుబాటులో ఉంచుతున్నారు. అలాగే గానుగ నూనె వాడకం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా వివరిస్తున్నారు. ప్రస్తుతం నూనె గానుగలో మూడు కేజీల పల్లీలకు ఒక కేజీ మాత్రమే నూనె వస్తుంది. కానీ మార్కెట్లో మాత్రం కేజీ పల్లి నూనె తక్కువ ధరకే ఎలా సాధ్యమనే ప్రశ్నలు తెలత్తుతున్నాయి. మార్కెట్లో దొరికే శనగనూనె కల్తీ అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. గానుగ నుంచి తీసిన నూనెతో అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టవచ్చని నమ్ముతున్నారు.