రెండే చాలు .. బూస్టర్ అవసరం లేదు ..

Chandrasekhar Reddy
దేశంలో కరోనా వాక్సినేషన్ శరవేగంగా సాగుతుంది. ప్రారంభంలో దీనిపై ఎన్నో అపోహలు ఉన్నప్పటికీ ప్రముఖులు ముందుకు రావటంతో అందరిలో దీనిపై అవగాహన పెరిగింది. ఈ వాక్సినేషన్ రెండు డోసులుగా ఇస్తున్నారు. వీటిద్వారా శరీరంలో కరోనా తో పోరాడగలిగే యాంటీబాడీలు తయారవుతాయి. తద్వారా కరోనా వచ్చినా పెద్ద ప్రమాదం ఉండబోదు. అలాగని వాక్సినేషన్ వేయించుకున్న వారు ఇష్టానుసారంగా ఉండటానికి కూడా వీలులేదు. అందరి లాగానే కరోనా నియమాలు పాటించాల్సిందే. ఈ వాక్సినేషన్ కేవలం ఉపశమనం మాత్రమే, పూర్తిగా కరోనా నుండి రక్షించలేదు. అసలు కరోనా రాకుండా చూసుకోవడం చాలా అవసరం, అలాంటి వైరస్ ఒక్కసారి శరీరం లోకి వెళ్తే ఎన్నో అవయవాలను చాలా వరకు దెబ్బతీస్తుంది. అంతగా శరీరం దెబ్బతిన్న తరువాత కరోనా నుండి బయటపడినా భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలు తప్పవు. అందుకే జాగర్తలు పాటిస్తూ, దానికి దూరంగా ఉండటమే ఉత్తమమైన పని.
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొదట 45 వయసు దాటిన వారికి వాక్సినేషన్ మొదలుపెట్టారు. దీనికి స్పందన బాగా వచ్చింది. ఒక్కసారి వీళ్ళ కేటగిరి కి వాక్సినేషన్ రెండు డోసులు పూర్తి చేసిన తరువాత మిగిలిన వారికి వాక్సినేషన్ ఇవ్వడం ప్రారంభించారు. ఒక్క రోజులో కోటికిపైగా వాక్సినేషన్ ఇస్తూ దేశం సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ వాక్సినేషన్ పై రోజుకొక ప్రకటన చేస్తుండటం చూస్తూనే ఉన్నాం. మొదట ఒకరకమైన వాక్సిన్ మాత్రమే రెండు డోసులు వేసుకోవాలని చెప్పింది. అనంతరం మార్చి కూడా వేసుకోవచ్చు అని చెప్పింది. ఇక అమెరికా అయితే రెండు డోసులు వేసుకున్న వారికి బూస్టర్ డోస్ అవసరం అని చెప్పుకొచ్చింది. ఇవన్నీ వారివారి వ్యాపారం లో భాగంగా చెప్పి ఉండవచ్చు. కానీ ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం మూడో డోస్(బూస్టర్) అవసరం లేదని స్పష్టం చేసింది.
ఈ సమయంలో కూడా కొందరు వాక్సినేషన్ తో వ్యాపారం చేస్తుండటం శోచనీయం. ప్రపంచంలో  ఉచితంగా వాక్సినేషన్ అందివ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ పలుదేశాలకు పిలుపునిచ్చింది. భారత్ ఇప్పటికే చాలా దేశాలకు ఉచితంగానే వాక్సినేషన్ సరఫరా చేయడం చూశాం. ప్రస్తుతం తీసుకుంటున్న రెండు డోసులతో కరోనా లో వచ్చే కొత్త మార్పులకు కూడా తట్టుకునే శక్తి ఉందని మరో డోస్ అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ప్రస్తుత పరిస్థితులలో బూస్టర్ డోస్ లు వంటివి సాధారణ ప్రజానికానికి ఇవ్వడం కంటే వాక్సిన్ అవసరమైన వారికి రెండు డోసులు సరఫరా చేయడం ఉత్తమమైన మార్గం అని సంస్థ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: