భారత్ లో కరోనా వైరస్ ఎండెమిక్ స్టేజీకి చేరిందా?

Mekala Yellaiah
భారతదేశంలో కరోనా వైరస్ తక్కువ నుంచి మీడియం స్థాయికి పడిపోవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ముఖ్య శాస్త్రవేత్త సౌమ్యాస్వామినాథన్ అనడం సంతోషాన్ని కలిగిస్తోంది. దేశంలో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందనే సందేహాలు వ్యక్తమవుతున్న తరుణంలో ఈ మాటలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. భారత్ లో కరోనా కేసులు రోజుకు నలభైవేలకు పైగా నమోదవుతున్న సమయంలో.. డాక్టర్ స్వామినాథన్ కరోనా ఎండెమిక్ స్థితికి చేరుకుంటోందన్నారు. వైద్య నిపుణులు మాత్రం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతున్నారు. భారతదేశంలో కరోనా వైరస్ పాండెమిక్ స్టేజి నుంచి ఎండెమిక్ వరకు చేరుకుంటుందని గతంలోనే వైరాలజిస్టులు అంచనా వేశారు. ప్రముఖ వైరాలజిస్టు జాకబ్ జాన్ అయితే ఈ విషయాన్ని గత సంవత్సరమే ప్రకటించారు. ఏదైనా ఒక వ్యాధి ప్రజల మధ్యనే శాశ్వతంగా ఉండిపోయే స్థితిని ఎండెమిక్ అంటారు. ఇప్పుడు ఎన్నో వ్యాధులు పూర్తిగా అంతం కాకుండా ఎండెమిక్ గా మారి, ప్రజల మధ్యనే ఉన్నాయి. అవి ఒకరి నుంచి ఒకరికి వ్యాపిస్తూ ఎండెమిక్ గా మారాయి. సాధారణ ఫ్లూ మొదలుకొని హైపటైటిస్-ఏ, హైపటైటిస్-బీ, తట్టు, మశూచి లాంటి వ్యాధులు ఎండెమిక్ గా ఉండి ప్రజల మధ్యనే ఉన్నాయి. అయితే కరోనా జంతువుల నుంచి మనుషులకు వచ్చిందా అనేదానిపై పక్కా ఆధారాలు లేవు. అలాంటప్పుడు కరోనా ఎండెమిక్ మారే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. పాండమిక్ అంటే ప్రజల్లో తీవ్రంగా సోకి, పెద్ద ఎత్తున వ్యాపించే వ్యాధి. ఎండెమిక్ అంటే ప్రజల మధ్యనే ఉంటూ, ఎక్కువ కాలంపాటు ఉండిపోయే వ్యాధి. అది ఒక చోటు నుంచి ఇంకొక చోటుకు వ్యాపిస్తుంది. ఇప్పుడు కరోనా వైరస్ కూడా మెల్లమెల్లగా ఎండెమిక్ గా మారుతోందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ప్రజల్లో ఆ వైరస్ వ్యాపిస్తున్నకొద్దీ తగ్గుతుంది. బ్రిటన్ లో 60 శాతం మంది వ్యాక్సిన్ తీసుకున్నారు. అక్కడ మరణాలు లేకున్నా, కరోనా వైరస్ మాత్రం ఉంది. భారీ జనాభా ఉన్న భారతదేశంలో 15 శాతం మందికి మాత్రమే వ్యాక్సిన్ వేశారు. ఈ సమయంలో వైరస్ ఎండెమిక్ కావచ్చని చెప్పడం తొందరపాటే అవుతుందని మరికొందరు నిపుణులు అంటున్నారు. ఎండెమిక్ వ్యాధులకు కూడా అవుట్ బ్రేక్ రావొచ్చని, అది పాండమిక్ గా కూడా మారొచ్చంటున్నారు. అయితే ఇది ప్రజల ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. జనం ఎలాంటి జాగ్రత్తలు పాటించకపోతే కేసులు వేగంగా పెరుగుతాయి. ఇప్పుడు దేశంలో రోజుకు 40 వేల కేసులు వస్తున్నాయి. ఇది ఇంకా పెరుగుతున్నట్టు కనిపించడంలేదు. అందుకే ఇది ఎండెమిక్ గా మారుతోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ లో కేసులు వేగంగా పెరిగాయి. సెకండ్ వేవ్ లోనూ తీవ్రమైంది. థర్డ్ వేవ్ లో కూడా కేసులు పెరిగితే అది పాండమిక్ అవుతుంది. అమెరికాతో పాటు కొన్ని దేశాలు ప్రజలకు వ్యాక్సిన్ బూస్టర్ డోస్ ఇస్తున్నాయి. భారతదేశంలో ఇంకా ప్రారంభించలేదు. కొద్దిరోజుల క్రితమే కోవాగ్జిన్ మూడో డోసు ట్రయల్ కు అనుమతి ఇచ్చారు. కొందరు శాస్త్రవేత్తలు కరోనా వైరస్ ఎండెమిక్ స్టేజీకి చేరబోతోందని చెబుతున్నా, కొన్ని రిపోర్టులు మాత్రం అక్టోబర్ లో కరోనా థర్డ్ వేవ్ రాబోతోందని హెచ్చరిస్తున్నాయి. ప్రభుత్వం కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెబుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: