గ్రేటర్‌లో స్పెషల్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌ కంటిన్యూ!

N.Hari
గ్రేటర్ పరిధిలో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని ... సర్కార్ స్పెషల్ డ్రైవ్ ను ప్రారంభించి 15  రోజులు దాటిపోయింది. ప్రతి ఇంట్లో  వ్యాక్సిన్ తీసుకోని వారి జాబితాను తెలుసుకుని మరీ... ఆయా కాలనీలలో మొబైల్ వ్యాక్సినేషన్‌ను చేపట్టింది. బల్దియా, వైద్య శాఖ ఎన్ని ఏర్పాట్లు చేసినా..  వంద శాతం వ్యాక్సినేషన్  పూర్తికాలేదు. దీంతో  మరింత అవగాహన పెంచుతూనే... మరిన్ని రోజుల పాటు స్పెషల్ వ్యాక్సిన్ డ్రైవ్స్ ను కొనసాగించాలని  వైద్య శాఖ నిర్ణయించింది. కరోనా కట్టడికి వ్యాక్సినే మందు. కరోనా నుంచి పూర్తి రక్షణ పొందాలంటే... వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే అని శాస్త్రవేత్తలు, వైద్యులు చెబుతున్నారు. 8 నెలల క్రితం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. అయితే మూడు నాలుగు నెలలుగా టీకా కార్యక్రమానికి మంచి స్పందన వస్తోంది. కోటి మందికిపైగా జనాభా ఉన్న హైదరాబాద్‌లో వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి  చేయాలని సర్కారు భావిస్తోంది.
 వైద్య ఆరోగ్యశాఖతో కలిసి బల్దియా అధికారులు గత నెలలో ప్రత్యేక వ్యాక్సినేషన్ డ్రైవ్‌ను ప్రారంభించారు.ఇంటింటికి వెళ్లి టీకా వేసుకోని వారి వివరాలను.. రెండో డోస్ పూర్తి కాని వారి వివరాలను సేకరిస్తున్నారు. దగ్గర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వ్యాక్సిన్ కేంద్రాలకు వెళ్లి టీకా తీసుకునేలా ప్రోత్సహిస్తున్నారు. ఇప్పటికే కుటుంబ సభ్యులందరూ టీకాలు తీసుకున్న ఇళ్లకు వ్యాక్సినేషన్ పూర్తయినట్లు ఓ స్లిప్‌ని అంటిస్తున్నారు.  ప్రత్యేక డ్రైవ్‌కు ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. స్పెషల్ డ్రైవ్ ప్రారంభించే నాటికే జీహెచ్ ఎంసీ పరిధిలోని 18 ఏళ్లకు పైబడిన వారు దాదాపు  70 శాతం మంది టీకాలు తీసుకున్నారు. మరికొందరికి టీకా తీసుకోవటం పట్ల అపోహలు ఉన్నాయి. దీంతో  వ్యాక్సిన్ డ్రైవ్‌కి ఆశించిన స్పందన రావటం లేదు. ముఖ్యంగా  ఓల్డ్ సిటీ వంటి ఏరియాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా నిదానంగా సాగుతోంది. ఇలాంటి ఏరియాల్లో అధికారులు స్పెషల్‌ ఫోకస్‌ పెడుతున్నారు. మొత్తంమీద గ్రేటర్‌లో వంద శాతం మందికి టీకాలు పూర్తి చేయాలంటే మరింత సమయం పట్టే అవకాశముంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: