పాము విషంతో క‌రోనాకు మందు..ప‌రిశోధ‌కుల ప్ర‌యోగాలు..!

Paloji Vinay
రెండు సంవ‌త్స‌రాల నుంచి ప్ర‌పంచ దేశాల‌ను క‌రోనా మ‌హ‌మ్మారి అత‌లాకుత‌లం చేస్తోంది. కొవిడ్‌-19 ను అరిక‌ట్టేందుకు ప‌రిశోధ‌కులు అనేక ప్ర‌యోగాలు చేస్తున్నారు. ఎన్నో రోజులుగా శ్ర‌మించి చివ‌రకు క‌రోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చారు. కానీ అది క‌రోనా పై పూర్తి ప్ర‌భావం చూప‌క‌పోవ‌చ్చ‌నే అనుమానాలు కూడా వ్య‌క్తం అయ్యాయి. అయితే, ఇత‌ర మందులు క‌నిపెట్టేందుకు ఇంకా ప‌రిశోధ‌న‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. తాజా బ్రెజిల్ శాస్త్ర‌వేత్త‌లు క‌రోనాను అరిక‌ట్టేందుకు పాము విషం ఉప‌యోగ‌ప‌డుతుందని స్ప‌ష్టం చేశారు.

 ముల్లును ముల్లుతోనే తీయాల‌న్న‌ట్టు ప్రాణాలు తీసే విష‌మే ప్రాణాలు క‌బ‌లించే క‌రోనా మ‌హ‌మ్మారిని అంతం చేయొచ్చ‌ని అంటున్నారు. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల మెడిసిన్‌ల త‌యారీలో కొన్ని పాముల విషాన్ని వాడుతున్నారు. తాజాగా క‌రోనా ను క‌ట్ట‌డి చేసే గుణం ఓ స‌ర్పం విషంలో ఉంద‌ని ప‌రిశోధ‌క‌లు తేల్చారు. ఈ అధ్య‌య‌నానిని సంబంధించిన వివ‌రాల‌ను `మాలిక్యూల్స్‌` అనే జ‌ర్న‌ల్ ప్ర‌చురించింది. బ్రెజిల్‌లో ఉండే ఒక రకమైన రక్తపింజరి స‌ర్పం విషం కణాలు కరోనా చికిత్సలో ఉపయోగపడే అవకాశం ఉన్న‌ట్టు బ్రెజిల్‌లోని సావోపాలో విశ్వవిద్యాలయ పరిశోధకులు క‌నిపెట్టారు.

 ఈ పాము విషంలోని ఓ పదార్థం కొవిడ్ వైరస్‌ పునరుత్పత్తిని కోతిలో సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వారు తేల్చారు. దాదాపు 75 శాతం వరకు వైరస్‌ పునరుత్పత్తి నిలిచిపోయినట్లు ప‌రిశోద‌కులు గుర్తించారు. కాగా, వైపర్‌ విషంలోని ఓ ‘పెప్టైడ్‌’.. కొవిడ్ వైరస్‌ పునరుత్పత్తిలో కీలకంగా వ్య‌వ‌హ‌రించే ‘పీఎల్‌ప్రో’ అనే ఎంజైమ్‌కు అనుసంధానం అవుతున్నట్లు ప్రొఫెసర్‌ రఫేల్‌ గైడో చెప్పారు. ఈ క్రమంలో ఇతర కణాలను ఈ పెప్టైడ్‌ ఏమాత్రం హాని క‌లిగించ‌ట్లేద‌ని పేర్కొన్నారు. యాంటీబ్యాక్టీరియల్‌ గుణాలున్న ఈ పెప్టైడ్‌ను ప్రయోగశాలల్లోనూ ఉత్పత్తి చేయొచ్చని,  దీనికోసం అనవసరంగా ప్రకృతిలో ఉండే పాముల్ని హింసించాల్సిన అవసరం లేదని గైడో పేర్కొన్నారు.

తర్వాతి దశ ప్రయోగాల్లో అసలు వైపర్‌ విషంలోని పదార్థానికి కొవిడ్ వైరస్‌ కణాల్లోకి ప్రవేశించకుండా తొలి దశలోనే అడ్డుకునే సామర్థ్యం ఉందో.. లేదో.. తేల్చనున్నారు ప‌రిశోధ‌కులు. అలాగే ఎంత డోసులో ఇస్తే ఆ పదార్థం ప్రభావవంతంగా పనిచేస్తుందో అనే విష‌యంపై ప్రయోగాలు మొద‌లు పెట్టారు. జంతువులపై చేసే ఈ ప్రయోగాలు సఫలమైతే.. తర్వాత దశలో మానవులపై కూడా వీటిని పరీక్షిస్తామని పరిశోధకులు వెల్ల‌డించారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: