ఇవి తింటే ప్రాణానికి ప్రమాదమా?

Mekala Yellaiah
కొన్ని ఆహార పదార్థాలను తింటే అనారోగ్యంతో పాటు ప్రాణానికి ప్రమాదం ఉంటుంది. వాటి విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా వ్యవహరించినా అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. రెడ్ బీన్స్, సోయాబీన్స్(రాజ్మా), జాజికాయ, కాజు మార్జు చీజ్, రుబర్బ్(రేవల్చిన్ని), పఫ్ఫర్ ఫిష్ ప్రాణానికి ప్రమాదమని చెబుతున్నారు. వాటిని తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఇంత రిస్క్ ఎందుకనుకుంటే వాటిని పూర్తిగా పక్కన పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆహార పదార్థాలను సరిగా ఎంపిక చేసుకోకున్నా, సరిగా ఉడికించకపోయినా, ఆహార పదార్థాలను నిల్వ చేసే పరిస్థితులు సరిగా లేకున్నా.. వాటిని తింటే వాంతులు, విరేచనాలు వస్తాయి. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తడమే కాకుండా కొన్నిసార్లు ప్రాణాంతకంగా మారతాయి. ఈ ఐదు పదార్థాల్లో ఆరోగ్యాన్ని మెరుగు పరిచే గుణమున్నా, ప్రతికూల ప్రభావాన్ని చూపెట్టేది ఎక్కువగా ఉందంటున్నారు. వీటిని తినే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
రెడ్ బీన్స్, సోయాబీన్స్, చిక్కుడు ఆరోగ్యానికి మంచివనే చెబుతారు. అయితే వాటిని సరిగా వండకుండా తింటే అనారోగ్యం కలుగుతుంది. ఉత్తర భారతదేశంలో ఈ ఎరుపు బీన్స్, సోయా బీన్స్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. వీటిలో ప్రోటీన్లు, ఫైబర్(పీచుపదార్థాలు), విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. వీటితో పాటు ఆరోగ్యాన్ని పాడుచేసే ‛ఫైటోహెమగ్లుటినిన్’ అనే కొవ్వు పదార్థాలు ఉంటాయి. ఈ కొవ్వు జీర్ణం కాకపోవడంతో సమస్యలు వస్తాయి. ఇంకా వాటిలో సహజమైన టాక్సిన్ కూడా ఉండడంతో అది ఆహారాన్ని జీర్ణం కాకుండా అడ్డుకుంటుంది. అయితే ఈ రెండు బీన్స్ ను కనీసం 12 గంటలపాటు నీటిలో నానబెట్టాలి. తరువాత కడిగి ఉడకబెట్టాలి. తరువాత ఆరబెట్టి, వండుకొని తినాలి. అప్పుడు ఎలాంటి సమస్యలు రావు.
ఇక జాజికాయ కూడా ఆరోగ్యానికి ప్రమాదమనే చెబుతున్నారు. కొన్ని రకాల వంటకాల్లో అదనపు రుచి కోసం వినియోగించే ఈ మసాలా దినుసు ఎక్కువగా ఇండోనేషియాలో దొరుకుతుంది. మటన్, ఆలుగడ్డ, సాస్ లు, ఇతర కూరగాయల వంటకాలు, కొన్ని రకాల పానీయాల తయారీలో జాజికాయను వాడుతారు. అయితే దీనిని అధిక మోతాదులో తీసుకుంటే ఆరోగ్యంపై దుష్ప్రభావాన్ని చూపుతుంది. నొప్పులు, వికారం, శ్వాస సమస్యలు, మూర్ఛతో పాటు మానసిక సమస్యలు వస్తాయి. జాజికాయతో ఆహారం విషతుల్యమై కొందరు చనిపోయిన సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకే దీని వాడకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
మరో ప్రమాదకరమైన ఆహారం కాజు మార్జు చీజ్. ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారంగా పేరుంది. దీని లోపల పురుగులు మనిషిని చంపుతాయంటున్నారు. అందులోని పురుగులను చూస్తే కొందరికి తినాలన్న ఆసక్తి కూడా కలగదు. ఇటలీలో దీనిని చాలా మంది ఇష్టపడతారు. పెకోరినో రొమానో అనే ఇటాలియన్ చీజ్ కు లార్వాలను కలిపి, కాజు మార్జును తయారు చేస్తారు. దీని లోపల ఉండే పురుగులు చీజ్ ను మెత్తగా, జిగురుగా మారుస్తాయి. దానిని తినేటప్పుడు మధ్య భాగం ద్రవపదార్థంలా ఉంటుంది. పురుగుల కారణంగా దీని రుచి భిన్నంగా ఉంటుంది. యూరోపియన్ యూనియన్ అనుమతి పొందిన ఆహార పదార్థాల జాబితాలో కాజు మార్జు చీజ్ లేదు. దీనిని విదేశాలకు ఎగుమతి చేసేందుకు అనుమతి లేదు. దీనిని తింటే కడుపులో అసౌకర్యం, వాంతులు, విరేచనాలు వస్తాయి. దీనిని ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఆహారంగా చెబుతున్నారు.
ఇక రుబర్బ్ తో చాలా జాగ్రత్తగా ఉండాలి. దీని కాడలు రుచికరంగా ఉన్నా, ఆకుల్లో విషం ఉంటుంది. బ్రిటిష్ వంటకాలతో పాటు ఫలహారాలు, పానీయాల్లో దీనిని ఎక్కువగా వాడుతారు. దీని ఆకుల్లో ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. ఇది కడుపులోకి వెళ్తే వికారం కలిగిస్తుంది. ఖనిజ లవణాలను జీర్ణం కాకుండా చేస్తుంది. మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడేందుకు ఆ పదార్థం కారణమవుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రుబర్బ్ కాడలు, ఆకుల్లోనూ ఆక్సాలిక్ ఆమ్లం ఉంటుంది. అయితే కాడల్లో తక్కువగా ఉంటుంది. ఆకులు ఎక్కువగా తింటే చనిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఇది తినే విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి. లేకుంటే అది తినకపోవడమే మంచిది.
ఇక చివరిదైన పఫ్ఫర్ ఫిష్ అత్యంత విషపూరితమైంది. దీని శరీరంలో విషపూరితమైన టెట్రోడోటాక్సిన్ ఉంటుంది. ఇది సైనైడ్ కంటే ప్రమాదకరమైందని అంటున్నారు. అయినా కొన్ని దేశాల్లో దీని వంటకాలకు డిమాండ్ ఉంది. ఈ చేపలో విషపూరితమైన అవయవాలను తొలగించిన తరువాతనే వండాలి. చేప మెదడు, చర్మం, కండ్లు, బీజకోశాలు, కాలేయం, పేగులు లేకుండా జాగ్రత్త పడాలి. లేకుంటే అవి తిన్న మనుషులు చనిపోయే ప్రమాదముంది. శిక్షణ పొందిన ప్రత్యేక చెఫ్ లే దీనిని వండుతారు. జపాన్ లో పఫ్ఫర్ ఫిష్ వంటకానికి చాలా ఆదరణ ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: