124 రూపాయలతో పెళ్లి.. ఎక్కడంటే..!

MOHAN BABU
కేవలం 124 రూపాయల ఖర్చుతో పెళ్లి..పైగా పెళ్లి బాధ్యతంతా వరుడు తరుపు వాళ్లదే. ఇక వారిలో ఆడపిల్ల పెళ్లి చేయాలని కష్టపడాల్సిన అవసరం లేదు. మథుర తెగగా పిలుచుకునే ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో కనిపించే మారుమూల గిరిజన సమూహం ఇది.ఆచార సంప్రదాయాల్లోనే కాదు, వేష భాషల్లో కూడా వీళ్ళు ప్రత్యేకమే. వీళ్లను చుట్టు లంబాడి, గాయితి లంబాడి, మురికి లబాన్ ఇలా రకరకాల పేర్లతో పిలుస్తారు. మథుర జాతిలో వీరిది ప్రత్యేక స్థానం. కులవృత్తి అయిన పశు పోషణలో సింహభాగం పనులు వీరే చేస్తారు. నిలువు కొప్పు వేసి అలంకరణ చేసుకోవడం వీరి ప్రత్యేకం.దీన్నే చుండా అని పిలుస్తారు.వీరి ఆభరణాలు కూడా ప్రత్యేకమే.

వాటిలో తల పై నుండి చుండా పడిపోకుండా బ్యాలెన్స్ చేసే డోరా తో పాటు మెడ,చెవులు కాళ్లకు ధరించే రాకిడి,ఘాటీ, మీట్, చూడా చాలా ముఖ్యమైనవి. వీరికంటూ లబానా అనే ఓ ప్రత్యేక భాష ఉంది. ప్రత్యేక నృత్య రీతులు కూడా ఉన్నాయి. ఈ జాతిలో చోపట్ అనే పాచికలాటకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఉమ్మడి కుటుంబ జీవనానికి ప్రాముఖ్యం ఇస్తారు. ఆడపిల్లలు కుటుంబానికి బరువు కాదనే సందేశం వీరి ఆచార సంప్రదాయాల్లో అంతర్లీనంగా కనిపిస్తుంది. వరకట్న సాంప్రదాయానికి ప్రాముఖ్యత చాలా తక్కువ. దాదాపుగా తీసుకోరు.పురిటి ఖర్చులు కూడా అత్తవారింటి బాధ్యతే.పెళ్లికి ఎంత ఖర్చు చేయాలన్న దానికి ప్రత్యేక విధానం ఉంది. ఆ ఖర్చు బాధ్యత వరుడిదే. ఆడపెళ్లి వారింట విడిది సందర్భంగా బాత్ అంటే భోజనం ఖర్చు, రాత్ అంటే రాత్రి బసకు అయ్యే ఖర్చు, మూట్ అంటే పెళ్లి కూతురు ఆమె తండ్రికి ఇచ్చే కొంత నగదుగా దీనిని విభజించారు.

ఈ మూడింటికి కలిపి 124 రూపాయల ఖర్చుతో పెళ్లి తంతు నిర్వహిస్తారు. శ్రీకృష్ణుడు, వెంకటేశ్వర స్వామి, పూరి జగన్నాథులను నమ్మే వీరి పూజల్లో సిక్కు ప్రార్థనలు కూడా ఉంటాయి. సంచార జాతికి చెందిన ఈ తెగ పురుషులు జంధ్యాన్ని కూడా ధరిస్తారు. ఇప్పుడు స్థిరనివాసాలకు అలవాటు పడిన వీరి జీవన శైలిలో ఆదిమతెగ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. తెలంగాణలో ప్రస్తుతం వీరు బీసీలుగా కొనసాగుతున్నారు.మథుర తెగ లను ఎస్టి కేటగిరిలో చేర్చాలన్న హామీపై తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ చల్లప్ప కమిషన్ నివేదిక ఆధారంగా మథుర, వాల్మీకి బోయ కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలని క్యాబినెట్లో తీర్మానించి గతంలో కేంద్ర ప్రభుత్వానికి నివేదించామని, పార్లమెంట్ సమావేశాల్లో దీన్ని మరోసారి ప్రస్తావిస్తామని మంత్రి తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: