ఉపాధ్యాయులు : ఎవరి కష్టాలు వారివే.. !

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. కరోనా కారణంగా బాగా ఇబ్బందులకు గురైన మరో వర్గం వీళ్లే. ముఖ్యంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు ఎక్కువగా ఇబ్బంది పడ్డారు. అసలు ప్రైవేట్ సంస్థలు జీతాలు ఇవ్వడమే లేటుగా ఇస్తుంటాయి. మరి కరోనా కాలంలో అయితే అసలుకే ఎసరు పెట్టారు. దీనితో చేసిన పనికి జీతాలు రాక, లాక్ డౌన్ లో వేరే పనికి వెళ్లలేక సామాన్య ఉపాధ్యాయులు మాత్రం చాలా కష్టాలు పడ్డారు. కొందరు నిత్యావసరాల సరఫరా నడుస్తుండటంతో ఆయా విభాగాలలో రోజువారీ కూలీలకు, దేశంలోని వివిధ ప్రాంతాలలో శానిటైజషన్ చేసే పనులకు కూడా వెళ్లారంటే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. కొందరు ఉన్నదానిలో కూరగాయలు బండ్లమీద తోసుకుంటూ అమ్ముకున్నారు. మరి కొందరు అలాంటి బండ్లమీదనే టిఫిన్ సెంటర్ల ను ఉపాధిగా ఏర్పాటు చేసుకున్నారు.
కరోనా లాంటి సంక్షోభం వచ్చినప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు ఆర్థికంగా ఇబ్బంది పడకపోవచ్చుగాని వారు సాంకేతిక సమస్యలతో అనేక ఇబ్బందులు పడ్డారు. అంటే వారి వద్ద ఉన్న సాంకేతికత తోనే పిల్లలకు అందుబాటులో ఉండాల్సిన పరిస్థితి వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పటి పరిస్థితులలో ఆన్ లైన్ విధానం కాబట్టి ప్రతి రోజు ఉపాధ్యాయులు విద్యార్థులకు అందుబాటులో ఉన్నట్టు విద్యా శాఖకు సమాచారం ఇవ్వడం ద్వారా వాళ్ళు రోజు పాఠశాలకు వచ్చినట్టుగా నమోదు చేసుకుంటారు. అందువలన ప్రతిరోజూ ఏదో ఒక విధంగా ఉన్నత అధికారులకు రిపోర్ట్స్ పంపించాల్సి వచ్చేది. అందుకు ఉన్న సాంకేతికత తో అనేక ఇబ్బందులు పడి మరీ రిపోర్టులు పంపించేవారు.
కరోనా సంక్షోభంలో ప్రైవేట్ ఉద్యోగస్తులు చాలా మంది ఉన్న ఉపాధి పోవటం ద్వారా పెద్ద సమస్య ఎదురుకోవాల్సి వచ్చింది. ఇది ప్రధానంగా ఆర్థికంగా ఇబ్బంది కాబట్టి వాళ్ళు ఆయా ప్రభుత్వాలకు విన్నవించుకున్నప్పటికీ ఫలితం లేక, వారే వివిధ మార్గాలలో ఒక అడుగు దిగి మరి ఉపాధులు  వెతుక్కున్నారు. సమసమాజ స్థాపన చేయగలిగిన శక్తి కేవలం ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది. వాళ్ళు విదార్దులను తీర్చిదిద్దే విధానం లోనే సమాజం లో విలువలు బ్రతుకుతాయి. అలాంటి వృత్తిలో ఉన్న వారు ముఖ్యంగా ప్రైవేట్ ఉద్యోగస్తులు మాత్రం ఈ సమయంలో ఎంత ఇబ్బంది పడ్డారో మాటల్లో చెప్పడం కష్టం. ఇది యావత్ విద్యావ్యవస్థకు అవమానం. విద్యావ్యవస్థలో ఉన్నత మార్పుల కోసం ప్రైవేట్ రంగానికి అవకాశం ఇచ్చారు, కానీ అదో వ్యాపారంగా పరిణమించింది తప్ప, విద్యావ్యవస్థలో ఉన్నత మార్పులు తేలేకపోయింది, ఇంకా చెప్పాలంటే ఉన్న స్థాయిని అనవసర పోటీ వలన దిగజార్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: