ఫీ‛జులుం’పై ఏపీ ప్రభుత్వం కొరడా!

Mekala Yellaiah
విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ లో పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ ఏర్పాటు చేశారు. దానికి హైకోర్టు రిటైర్డ్ జడ్జి కాంతారావు చైర్మన్ గా, పలువురు విద్యారంగ నిపుణులు సభ్యులుగా ఉన్నారు. ఈ కమిషన్ సిఫారసుల మేరకు ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో ఫీజులు ఎంత వసూలు చేయాలో నిర్ణయిస్తూ ప్రభుత్వం జీవో 53, 54 జారీ చేసింది. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాల వరకు ఈ ఫీజులు వర్తిస్తాయని ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. జీవో 53, 54 ప్రకారం గ్రామ పంచాయతీల్లో నర్సరీ నుంచి పదో తరగతి వరకు రూ.10 వేలు, పట్టణాల్లో అయితే రూ.11 వేలు, నగరాల్లో రూ.12 వేలు వసూలు చేయాలి. హాస్టల్ విద్యార్థులకైతే గ్రామ పంచాయతీల్లో రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేల వరకే ఫీజు వసూలు చేయాలి. ఇంటర్మీడియెట్ లో సైన్సు, మ్యాథ్స్ గ్రూపులకు గ్రామ పంచాయతీల్లో రూ.15 వేలు, పట్టణాల్లో రూ.17.5 వేలు, కార్పొరేషన్లలో గరిష్టంగా రూ.20 వేలు వరకు వసూలు చేయాలి. ఆర్ట్స్ గ్రూపులకు రూ.12 వేలు, రూ. 15 వేలు, రూ.18 వేలుగా ఫీజు నిర్ణయించారు. ఇంటర్ విద్యార్థులకు హాస్టల్ ఫీజు గ్రామ పంచాయతీల్లో ఏడాదికి రూ.18 వేలు, పట్టణాల్లో రూ.20 వేలు, నగరాల్లో రూ.24 వేలు మించకూడదు. జేఈఈ మెయిన్స్, నీట్ లాంటి కోచింగులకు రూ. 20 వేలు మాత్రమే వసూలు చేయాలి. పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తే కిలోమీటరుకు రూ.1.20 పైసలు వసూలు చేయాలి. ఫీజులన్నీ ఏడాదిలో మూడు సమాన వాయిదాల్లో వసూలు చేయాలి. ఇతర శిక్షణ పేరుతో ఎలాంటి ఫీజులు వసూలు చేయవద్దు. వసూలు చేసిన ఫీజులను దేనికి వినియోగించాలో కూడా ప్రభుత్వం చెప్పింది. వసూలు చేసిన ఫీజులో 50 శాతాన్ని టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ కు వేతనాలు ఇవ్వాలి. మరో 15 శాతాన్ని గ్రాట్యుటీ, పీఎఫ్, గ్రూపు ఇన్సూరెన్స్ కోసం ఖర్చు చేయాలి. మరో 20 శాతం ఫీజును పాఠశాల లేదా కళాశాల అభివృద్ధి కోసం వినియోగించాలి. ఫీజులు, ఖర్చుల వివరాలు విద్యాసంస్థల వెబ్ సైట్లలో ఉంచాలి. దీంతో పాటు విద్యా సంస్థల్లో పనిచేస్తున్న టీచర్లు, లెక్చరర్ల వివరాలు, వారి విద్యార్హతలు, వారికి ఇస్తున్న జీతాల వివరాలన్నీ విద్యాశాఖకు సమర్పించాలి. ప్రభుత్వం నిర్ణయించిన ఈ ఫీజుల విషయంలో తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ జీవోలను ప్రైవేట్ విద్యాసంస్థలు అమలు చేసేందుకు సుముఖంగా లేవని తెలుస్తోంది. పాత విధానంలోనే ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నాయంటున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన ఫీజులు సరిపోవని ప్రైవేట్ విద్యాసంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: