పది విద్యార్థులకు మళ్లీ పాత విధానం..!

పది పరీక్షలు రాసే విద్యార్థులకు మళ్లీ పాత రోజులు వచ్చేశాయి. కార్పోరేట్ విద్యా సంస్థల ఆగడాలకు చెక్ పెట్టేందుకు గత ప్రభుత్వాలు తీసుకు వచ్చిన గ్రేడింగ్ విధానానికి ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ మంగళం పాడింది. ప్రస్తుతం అమలులో ఉన్న గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ల స్థానంలో మళ్లీ మార్కుల విధానాన్నే అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ విషయంపై ఏపీ పాఠశాలవిద్యా శాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు 2010లో తీసుకువచ్చిన గ్రేడింగ్ విధానానికి ఏపీ సర్కార్ స్వస్తి పలికింది. అయితే అన్ని ప్రవేశాలు, నియామకాల్లో ప్రతిభను గుర్తించేందుకు ఇకపై మార్కులు ఇవ్వనున్నట్లు గతేడాది నుంచే ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఎక్కువ మంది విద్యార్థులకు ఒకే గ్రేడ్ వచ్చినప్పుడు ప్రవేశాలు, నియామకాల్లో తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదిక సమర్పించారు. ఈ సమస్యను అధిగమించేందుకు గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని ప్రభుత్వానికి విద్యా శాఖ సంచాలకులు ప్రతిపాదనలు సమర్పించారు కూడా. 2019 మార్చి వరకు పరీక్షలు రాసిన విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లను అధికారులు ఇస్తారు. 2019-2020 విద్యా సంవత్సరం పూర్తి చేసుకున్న విద్యార్థులకు గతేడాది మార్చి నెల నుంచి మార్కులు కేటాయిస్తారు. అయితే కరోనా కారణంగా గతేడాది, ఈ ఏడాది కూడా పరీక్షలు నిర్వహించలేదు. అందుకోసమే ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ విధానంలోనే నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే పదవ తరగతిలో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కొంత కష్టంగా మారింది. అందుకోసమే ప్రభుత్వ పరీక్షల విభాగం నుంచి ఇంటర్నల్ మార్కులను తీసుకుని.... వాటి ఆధారంగా ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహించాలని ముందుగా భావించారు. అలా చేయడం వల్ల మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే... న్యాయ పరమైన సమస్యలు వస్తాయని పరీక్షల విభాగం సూచించింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసింది. తిరిగి మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎన్నో ఏళ్లుగా విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు, ఆత్మహత్యల నివారణకు గ్రేడింగ్ విధానాన్ని అమలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: