ప్రత్యక్ష బోధనలో విద్యార్థుల క్షేమం ఎంత?

N.Hari
తెలంగాణలో సెప్టెంబర్ ఒకటి నుంచి బడులు తెరుచుకోబోతున్నాయి. ప్రత్యక్ష బోధనకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. పాఠశాలల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైనా విధివిధానాలను రూపొందించింది. కేజీ టు పీజీ వరకు విద్యార్థులకు ప్రత్యక్ష బోధనే ఉంటుందని తేల్చి చెప్పింది. ఆన్‌లైన్  విద్యాబోధన ఉండదని స్పష్టం చేసింది. 17 నెలలుగా విద్యావ్యవస్థ అతలాకుతలం అయిందని, విద్యార్థుల భవిష్యత్ కోసమే ప్రత్యక్ష బోధనకు మొగ్గు చూపామని చెబుతోంది.
అయితే ప్రభుత్వ మార్గదర్శకాలను మాత్రం తల్లిదండ్రులు తప్పుపడుతున్నారు.  కేజీ టు పీజీ ప్రత్యక్ష బోధన అంటూ తెలంగాణ సర్కారు తీసుకున్న నిర్ణయంపై తల్లిదండ్రుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సరైన ఏర్పాట్లు చేయకుండా బడులు ఎలా తెరుస్తారని కొందరు ప్రశ్నిస్తున్నారు. వంద శాతం విద్యార్థుల హాజరుతో ఫిజికల్ డిస్టెన్స్ ఎలా సాధ్యమవుతుందని ఆందోళన చెందుతున్నారు. అన్ని తరగతుల విద్యార్థులు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరైతే.. భౌతిక దూరం ఎలా పాటిస్తారని పలువురు తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. మౌలిక వసతులు కూడా సరిగా లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
సర్కారు మార్గదర్శాలపై విద్యావేత్తలు కూడా పెదవి విరుస్తున్నారు. తల్లిదండ్రుల్లో మనోధైర్యం నింపేలా ప్రభుత్వ చర్యలు లేవని విమర్శిస్తున్నారు. వంద శాతం హాజరు కాకుండా.. ప్రత్యక్ష బోధనలో కీలక మార్పులు తేవాలని సూచిస్తున్నారు. ఒకేసారి అన్ని తరగతులు ప్రారంభించకూడదని అభిప్రాయపడుతున్నారు. సరి- బేసి విధానంలో రోజు విడిచి రోజు తరగతులు నిర్వహించాలని కోరుతున్నారు. చాలా రోజుల తర్వాత పాఠశాలలు ఆరంభం అవుతున్నాయన్న ఆనందం కంటే.. కరోనా కోరల్లోకి పంపిస్తున్నామా అనే ఆందోళనే కొందరు తల్లిదండ్రుల్లో ఎక్కువగా కనిపిస్తోంది. అయితే తల్లిదండ్రుల్లో ఉన్న భయాన్ని పోగొట్టాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందనే వాదన వినిపిస్తోంది..! అయితే ఇప్పటికే ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నామని, భయాందోళన వద్దని చెబుతున్న రాష్ట్ర విద్యా శాఖ.. సెప్టెంబరు ఒకటి నుంచి ప్రారంభమయ్యే ప్రత్యక్ష బోధనను ఎంత పకడ్బందీగా నిర్వహిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: