ఇంటర్‌ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు

N.Hari
తెలంగాణ‌లో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీలు స‌రికొత్త శోభను సంతరించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌ర్వాత ఎక్క‌ువగా విద్యార్థులు కార్పొరేట్,  బ‌డ్జెట్‌ కాలేజీల‌కు ప్రాధాన్య‌త ఇవ్వ‌డంతో ప్ర‌భుత్వ కాలేజీలు వెల‌వెల‌బోయేవి. అయితే గ‌త రెండేళ్లుగా క‌రోనా చూపించిన ఎఫెక్ట్‌తో త‌ల్లిదండ్రులు ఆర్థికంగా చితికిపోయారు. విద్యార్థులకు అధికంగా ఫీజుల క‌ట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డింది. దీంతో త‌మ పిల్ల‌ల‌ను కార్పొరేట్‌కు బ‌దులు స‌ర్కార్ కాలేజీల్లోనే చేర్చేందుకు పోటీ ప‌డుతున్నారు. ఫలితంగా ఈ ఏడాది అత్య‌ధికంగా రికార్డు స్థాయిలో ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్లు జరిగాయి. 2014లో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్ల సంఖ్య 50 వేలు కూడా దాట‌లేదు. గ‌డిచిన ఏడాది 80వేల‌కు మించ‌లేదు. ఈ ఏడాది ఏకంగా ల‌క్షా 9 వేలు ఇప్ప‌టివ‌ర‌కు అడ్మిష‌న్ల ప్రక్రియ దాటింది. ఇంట‌ర్ విద్య‌ను మెరుగుప‌ర‌చ‌డం.. పేరెంట్స్ ప్ర‌భుత్వ విద్య‌పై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని ఒమ్ము కానివ్వ‌బోమని తెలంగాణ విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్రంలో అత్య‌ధికంగా ఫ‌ల‌క్ నుమా జూనియ‌ర్ కాలేజీలో ఇంట‌ర్ ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్లు జ‌రిగాయి. ఇక్కడ మొత్తం 2,600 అడ్మిష‌న్లు నమోదయ్యాయి. మొత్తం 450పైగా కాలేజిల్లో మూడింత‌ల మేర అడ్మిష‌న్లు పెరిగాయి. అబిడ్స్‌లో ఉన్న మ‌హ‌బూబియా మ‌హిళా జూనియ‌ర్ కాలేజీలో గ‌తేడాది కేవ‌లం 180 మాత్ర‌మే అడ్మిష‌న్లు జ‌ర‌గగా ఈ ఏడాది ఇప్ప‌టివ‌ర‌కు 600 పైగా అడ్మీష‌న్లు జ‌రిగాయి. విద్యార్థుల సంఖ్య పెర‌గ‌డంతో వ‌స‌తుల క‌ల్ప‌న ఇప్పుడు స‌ర్కార్‌కు స‌వాల్‌గా మారింది. అదనంగా భ‌వ‌నాలు సైతం అవ‌స‌రం కానున్నాయి. వీటితోపాటు  ల్యాబ్ ఫెసిలిటీ, అధ్యాప‌కుల‌ను పెంచ‌డం, మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌నపై ఫోక‌స్ చేసిన‌ట్లు ఇంట‌ర్ బోర్డ్ ప్ర‌క‌టించింది. మొత్తంమీద తెలంగాణ‌లో క‌రోనాతో ప్రైవేట్ జూనియ‌ర్ కాలేజీలు మూత‌ప‌డుతుంటే సర్కార్ కాలేజీలు మాత్రం పండుగ చేసుకుంటున్నాయి. ఎన్న‌డు లేనంత‌గా రికార్డ్ స్థాయిలో ఈసారి ఫ‌స్ట్ ఇయ‌ర్ అడ్మిష‌న్లు న‌మోద‌య్యాయి.  కరోనా కార‌ణంగా ప్రైవేట్ కాలేజీల దోపిడీకి అడ్డుక‌ట్ట ప‌డ‌గా.. స‌ర్కార్ కాలేజీల‌కు ఎమ్మెల్యేలు మంత్రుల‌తో రిక‌మండేషన్‌  చేయించుకొనే ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: