ఇంకా భ్రమల్లోనే జగన్‌.. నిజాలు గ్రహించడా?

వైసీపీ చరిత్రలో కనీ వినీ ఎరుగని రీతిలో ఓటమి పాలు అయింది. 151 సీట్లు ఎక్కడ 11 స్థానాలు ఎక్కడా అనేది చూడాలి. ఆకాశ విహారం నుంచి పాతాళానికి పడినట్లు అయింది. కనీసం ప్రతిపక్ష స్థానానికి సరిపడ 18 సీట్లు కూడా రాలేదు. దాంతో వైపీసీ పరిస్థితి ఇప్పుడు రాజకీయంగా అత్యంత దయనీయంగా ఉంది. ఇటు వంటి నేపథ్యంలో మాజీ సీఎం జగన్ ఓటమిపై పోస్టు మార్టం నిర్వహిస్తున్నారు.

పార్టీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వరుసగా భేటీలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పార్టీని మళ్లీ మొదట నుంచి పునః నిర్మాణం చేయాలి. గతంలో చేసిన పొరపాట్లను వల్లె వేసుకొని తిరిగి వాటిని పునరావృతం కాకుండా చూసుకోవాలి. దానికి లోతైన అధ్యయనం కావాలి. నిజాయితీతో కూడిన విశ్లేషణ అవసరం. నిష్పక్షిపాతంగా పోస్టు మార్టం జరగాలి. కానీ వైసీపీలో అటువంటిదే జరుగుతుందా అంటే లేదనే సమాధానం వినిపిస్తోంది.

తాజాగా తన వద్దకు వచ్చిన నేతలతో జగన్ 99 శాతం హామీలు అమలు చేశాం. మ్యానిఫెస్టోని పవిత్రగ్రంధంగా భావించాం. సంస్కరణలు తీసుకొచ్చాం. వాలంటీర్ వ్యవస్థ, బటన్ నొక్కడం ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలో నేరుగా నగదు బదిలీ చేశాం. అంటూ పాత పాటనే పాడుతున్నారు. ఇవే మాటలు జగన్ గత రెండున్నరేళ్లుగా చెబుతున్నారు. ఎన్నికల ముందు అవే మాటలు. ఇవన్నీ విన్నా కూడా జగన్ కు ప్రజలు ఓటు వేయలేదు.

ఈ విషయాన్ని జగన్ మరిచి మళ్లీ చేసిందే చెబుతున్నారు. ఎందుకు ఓడిపోయామో తెలియదు అంటూ దేవుడిపై నెట్టేశారు. తప్పులు జరిగాయి కాబట్టే 151 నుంచి 11 కి పడిపోయామనే విషయాన్ని జగన్ గ్రహించడం లేదు. ఇప్పుడు కూడా జగనే మాట్లాడుతున్నారు తప్ప తన వద్దకు వచ్చిన వారికి అవకాశం ఇవ్వడం లేదు. వాస్తవానికి ఎమ్మెల్యేలకు, మాజీ మంత్రులకు, పార్టీ నాయకులకు ఎందుకు ఓడిపోయామో స్పష్టమైన కారణాలు తెలుసు. వారి చేత మాట్లాడించి.. వారి చెప్పింది వింటే పార్టీ బలహీనతలు బయట పడతాయి. అవి మానేసి చెప్పిందే చెబితే పార్టీ పటిష్ఠం కాకపోగా మరింత బలహీనం అవుతుంది. ఈ విషయాన్ని జగన్ గుర్తించాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: