ఏపీ, తెలంగాణ అప్పుల చిట్టా బయటపెట్టిన కేంద్రం?

అప్పులు.. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన డిబేట్.. మీరు అంత అప్పు చేశారు.. కాదు.. మీరే అంత అప్పు చేశారు అంటూ అధికార విపక్షాలు వాదులాడుకుంటున్న సమయంలో అసలు ఏ రాష్ట్రానికి ఎంత అప్పుందో కేంద్రం పార్లమెంటులో చెప్పేసింది. తెలంగాణ కాంగ్రెస్‌ సభ్యుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌.. గడచిన మూడేళ్ళలో 'బహిరంగ మార్కెట్‌' నుంచి రాష్ట్రాలు తీసుకున్న రుణాల జాబితాను విడుదల చేశారు.

బడ్జెటేతర రుణాల వివరాలు లేకుండా... కేవలం బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల వరకే కేంద్రం వివరాలు ఇవ్వడం విశేషం.  ఇతర మార్గాల ద్వారా తీసుకున్న రుణాలకు బడ్జెట్‌ నుంచి అసలు, వడ్డీ చెల్లిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్న కేంద్ర ఆర్ధిక శాఖ.. ఇకపై అలా చెల్లిస్తే.... వాటిని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పుల కిందనే పరిగణించాల్సి వస్తుందని ఇప్పటికే హెచ్చరించామని తెలిపింది. ప్రత్యేక కార్పొరేషన్‌ల ద్వారా తీసుకునే రుణాలను ఇకపై ప్రభుత్వ అప్పులుగానే పరిగణించనున్నట్లు కేంద్ర ఆర్ధిక శాఖ స్పష్టం చేసింది.

బ్రేవరేజ్ కార్పొరేషన్ లాంటి వాటి ద్వారా తీసుకునే రుణాలు కూడా ఇకపై రాష్ట్ర ప్రభుత్వం చేసే అప్పుగానే  పరిగణించనున్నట్లు కేంద్రం తేల్చి చెప్పింది. టాక్స్‌లు, సెస్‌లను తాకట్టు పెట్టీ తెచ్చే అప్పులనూ... రాష్ట్ర ప్రభుత్వ రుణాలుగానే చూస్తామని రాష్ట్రాలను కేంద్ర ఆర్ధిక శాఖ హెచ్చరించింది. రిజర్వ్‌ బ్యాంకు ''స్టేట్‌ ఫైనాన్స్‌: ఎ స్టడీ ఆఫ్‌ బడ్జెట్స్‌ 2021-22'' పేరుతో ఒక నివేదిక తయారు చేసినట్లు తన సమాధానంలో పేర్కొన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు.

కేంద్రం విధించిన నికర రుణ పరిమితి ప్రకారం.. బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాల జాబితాను పార్లమెంటుకు ఇచ్చిన కేంద్ర ఆర్ధిక శాఖ... బహిరంగ మార్కెట్‌ నుంచి తీసుకున్న రుణాలపై రిజర్వ్‌ బ్యాంకు ఇచ్చిన నివేదికను పార్లమెంటుకు సమర్పించింది. దీని ప్రకారం...
2020 మార్చి 31 నాటికి ఆంధ్రప్రదేశ్‌ అప్పులు  రూ. 3,07,671.5 కోట్లు.. అలాగే 2021 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు  రూ. 3,60,333.4 కోట్లు.. 2022 మార్చి 31 నాటికి ఏపీ అప్పులు  రూ. 3,98,903.6 కోట్లు.
ఇక తెలంగాణ అప్పులు...2020 మార్చి 31 నాటికి : రూ. 2,25,418.0 కోట్లు.. 2021 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ. 2,67,530.7 కోట్లు.. 2022 మార్చి 31 నాటికి తెలంగాణ అప్పులు రూ. 3,12,191.3 కోట్ల అప్పులుగా కేంద్రం తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: