గోడౌన్లలోనే ధాన్యానికి మొలకలు.. ఎవరిదీ పాపం?

రైతు పంట పండించాలంటే ఎంతో కష్టపడాలి.. పొలం దున్నీ నాట్లు వేసి.. కలుపుతీసి.. పంటను కాపాడుకుని.. కోతకోసీ కుప్పువేసి.. నూర్పిడి చేసి..ఇలా ఆరుగాలం శ్రమిస్తే కానీ ధాన్యం ఇంటికి రాదు.. కానీ.. అలా ఎంతో కష్టపడి పండించిన అలాంటి ధాన్యం.. వట్టి పుణ్యానికి మొలకలు వచ్చి దేనికీ పనికికారుండా పోతే.. దానికి ఎవరిది బాధ్యత.. ఇప్పుడు తెలంగాణ రైతన్నను వేధిస్తున్న ప్రశ్న ఇదే.. ఎందుకంటే.. పలు జిల్లాల్లో ధాన్యం తాజా వర్షాలకు మొలకలు వచ్చి రైతన్న కష్టం.. వృథా అవుతోంది.

కేంద్ర, రాష్ట్రాల మధ్య నెలకొన్న సమస్యల కారణంగా ఇలా ధాన్యం వృథా అవుతోంది. దీనివల్ల మిల్లర్లను  కూడా అవస్థలపాలు చేస్తోంది. ఎఫ్‌సీఐ  బియ్యం సేకరించకపోవడం వల్ల తెలంగాణలో నెలన్నర నుంచి మిల్లింగ్‌ ఆగిపోయింది. ఎడతెరిపిలేని వర్షాలు, మిల్లింగ్‌ నిలిచిపోయింది. దీంతో  ధాన్యం బస్తాలు మొలకలెత్తుతున్నాయి.  పాత నిజామాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌, మెదక్‌ జిల్లాల్లో అధిక మొత్తంలో ధాన్యం తడిసింది. ఇలా మిల్లుల్లో వర్షాలకు మొలకెత్తిన ధాన్యం విలువ 1500 వందల కోట్లకుపైగానే ఉంటుంది.

నిజామాబాద్ ఖానాపూర్ వద్ద ఉన్న అమ్మ రైస్ మిల్లులో... వందల క్వింటాళ్ల ధాన్యం మొలకలు వచ్చింది. మిల్లు లో స్థలం లేక  వడ్ల బస్తాలపై టార్ఫాలిన్లు కప్పి బయటే ఉంచారు. భారీ వర్షాలకు  బస్తాలు తడిశాయి. నెలన్నర నుంచి మిల్లింగ్‌కు అనుమతించకపోవడంతో ఈ పరిస్థితి వచ్చింది. నిజామాబాద్‌లోని పలు మిల్లుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మిల్లింగ్ లో అడ్డంకులు రావడం వల్లే... తమకీ దుస్థితి తలెత్తిందని రైస్‌ మిల్లుల యాజమానులు అంటున్నారు.

వరంగల్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి.  ఖానాపురం మండలం అశోక్‌నగర్‌ గ్రామంలో ఐదువేల బస్తాల ధాన్యం తడిసిపోయి మొలకలు వచ్చాయి.  ఎన్ని పరదాలు కప్పినా వర్షాలకు వడ్లు మొలకెత్తాయి. నర్సంపేట డివిజన్ లో 30 వేల బస్తాలు తడిసిపోయాయి. మిల్లింగ్‌ వెంటనే ప్రారంభించకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణం సమస్యను పరిష్కరించాలి.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: