చంద్రబాబు చేతికి ఉంగరం.. వెనుక ఇంత కథ ఉందా?

టీడీపీ అధినేత చంద్రబాబు అనగానే గుర్తొచ్చే రూపం.. లేత పసుపు రంగు చొక్కా.. అదే రూపం.. అదే గెటప్.. ఎప్పుడూ పెద్దగా మార్పులు ఉండవు.. అలాగే ఆహార్యంలో హంగులు, ఆర్భాటాలు తక్కువ. చేతికి వాచీలు, ఉంగరాలు, మెడలో గొలుసులు వంటి ఆభరణాలు ఆయన పెద్దగా ధరించరు. ఆర్భాటాలకు దూరంగా సాధారణంగా కనిపించే చంద్రబాబు..తన వేలుకు ఉంగరం ధరించడం తెలుగు దేశం కార్యకర్తల్లో ఆసక్తి కలిగించింది. చంద్రబాబు ఇటీవల ఓ విచిత్రమైన ఉంగరంతో కనిపించడం ఆసక్తిరేపుతోంది. ఈ ఉంగరం.. ఇటీవల మదనపల్లె బహిరంగ సభ సమయంలో బాగా కనిపించింది.

మదనపల్లెలో జరిగిన మినీ మహనాడుకు హజరైన చంద్రబాబు కార్యకర్తలకు అభివాదం చేస్తున్న సమయంలో తన చేతి చూపుడు వేలుకు ఉన్న ఉంగరాన్ని కార్యకర్తలు గమనించారు. అప్పటి నుంచి చంద్రబాబు ఉంగరంపై పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. సాధారణంగా ఉంగరం.. ఉంగరం వేలుకు పెట్టుకుంటారు. కానీ చంద్రబాబు మాత్రం ఎడమ చేతి చూపుడు వేలుకు ధరించారు. అయితే పార్టీ వర్గాల్లో ఈ చర్చ జరుగుతుండటం వల్ల స్వయంగా చంద్రబాబే ఆ ఉంగరం గురించి వివరణ ఇచ్చారు.

రాజంపేట నియోజకవర్గ సమీక్ష సందర్భంగా టీడీపీ కార్యకర్తలు ప్రస్తావించడంతో ఉంగరం ప్రత్యేకతను చంద్రబాబు స్వయంగా వివరించారు. ఇది మామూలు ఉంగరం కాదని.. ఈ ఉంగరంలో ఓ చిప్ ఉందని చంద్రబాబు వివరించారు. ఈ ఉంగరం కంప్యూటర్ తో అనుసంధానించిన చిప్ ఉందట. ఆ చిప్ ఎప్పటికప్పుడు.. చంద్రబాబు తన హృదయ స్పందనలను, తాను నిద్రిస్తున్న తీరును, ఆయన నడక, ఇతర ఆరోగ్య వివరాలు నమోదు చేస్తుందన్నారు.

చంద్రబాబు రోజులో ఎంత సేపు పని చేశారు. ఎంత విశ్రాంతి తీసుకున్నారు. ఎంత సేపు నిద్రపోయారు.. ఆరోగ్యం, బీపీ వివరాలు అన్నీ ప్రతి సెకనుకూ నమోదు చేస్తుందట. ప్రతి రోజూ ఈ రిపోర్టు చూసుకుని తన ఆరోగ్యం గురించి చంద్రబాబు సమీక్షించుకుంటారట. అదీ చంద్రబాబు ఎడమ చేతి వేలి ఉంగరం కథ. ఇది విన్న వాళ్లు.. ఎంతైనా హెటెక్ చంద్రబాబు కదా అనుకుంటున్నారు మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: