ఏపీపీఎస్సీ.. తీరు మారాల్సిందే..?

రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్‌ కమిషన్లు.. ఏళ్లు గడుస్తున్నా.. తమ తీరు మార్చుకోవడం లేదు. ఒక నోటిఫికేషన్‌ అంటూ వస్తే.. అది పూర్తయి నియామక పత్రాలు చేతికందేసరికి ఏళ్లూ పూళ్లు గడుస్తున్నాయి. గతంలో 2011 గ్రూప్ వన్ నోటిఫికేషన్‌ నియామక ప్రక్రియ పూర్తి అయ్యేందుకు ఏడేళ్లు పట్టిన విషయం తెలిసిందే. అది రాష్ట్ర విభజనకు ముందు.. ఇక రాష్ట్ర విభజన తర్వాత వచ్చిన 2018 ఏపీపీఎస్సీ గ్రూప్‌ నోటిఫికేషన్‌ ఫలితాలు వచ్చేందుకు కూడా నాలుగైదేళ్లు పట్టింది.

తాజాగా 2018 గ్రూప్ ఫలితాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. విజయవాడలోని ఎపీపీఎస్సీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఛైర్మన్ గౌతమ్ సవాంగ్ ఫలితాలు విడుదల చేశారు. ఈ  ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్ సైట్లో పొందు పరిచారు. దీని పూర్వాపరాలు చూస్తే..  167 గ్రూప్1పోస్టుల భర్తీకి 2018 లో ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అప్పట్నుంచి నాలుగేళ్ల పాటు ఈ నియామక ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కరోనా వల్ల మూల్యాంకనం ఆలస్యమైంది.

ఆ తర్వాత డిజిటల్ వాల్యువేషన్ పై అభ్యంతరాలు తెలపుతూ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో విషయం కోర్టుకు వెళ్లింది. కోర్టు తీర్పుతో తిరిగి మాన్యువల్ విధానంలో మూల్యాంకనం చేయాల్సి వచ్చింది. ఇలా అనేక కారణాలతో నియామక ప్రక్రియ చాలా ఆలస్యమైంది. ఇక ఈ గ్రూప్ 1 ఫలితాలు చూస్తే.. ఉద్యోగాలకు ఎంపికైన వారిలో  67 మంది మహిళలు ఉన్నారు.

విజేతల్లో 96 మంది పురుష అభ్యర్థులు ఉన్నట్లు గౌతమ్ సవాంగ్ తెలిపారు. వివిధ కారణాలతో  4 పోస్టులను భర్తీ చేయలేదని ఏపీపీఎస్సీ ప్రకటించింది. అలాగే డిప్యూటీ కలెక్టర్ల పోస్టులకు ఎంపికైన వారిలో టాప్ లో నిలిచిన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ప్రకటించింది. డిప్యూటీ కలెక్టర్ పోస్టుల్లో  టాప్ 1 లో  తూర్పు గోదావరి జిల్లా పిఠాపురానికి చెందిన రాణి సుస్మిత నిలిచారు.  టాప్ 2 లో నిలిచిన  వైఎస్ ఆర్ జిల్లా కొతులగుట్టపల్లి కి చెందిన కె.శ్రీనివాసరాజు నిలిచారు. టాప్3లో హైదరాబాద్ కు చెందిన సంజన సింహ నిలిచారు. ఇకనైనా నియమకాల పక్రియ ఏళ్ల తరబడి జరగకుండా ఏపీపీఎస్సీ జాగ్రత్తలు తీసుకోవాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: