శభాష్‌.. శ్రీలంకను మరోసారి ఆదుకున్న ఇండియా?

మన పొరుగున ఉన్న శ్రీలంక ఆర్థిక సంక్షోభంలో ఉన్న సంగతి తెలిసిందే. ఆ దేశంలో ఇంధన సంక్షోభం నెలకొంది.. విదేశాల నుంచి ఇంధనం కొనుగోలు చేసేందుకు విదేశీ మారక నిల్వలు లేవు. దీంతో అక్కడ డీజిల్, పెట్రోల్ బంకులు మూతబడ్డాయి. దీంతో ఇండియా మరోసారి శ్రీలంకను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. నాలుగు నౌకలతో డీజిల్‌, పెట్రోల్‌ను శ్రీలంకకు  తరలించాలని నిర్ణయించింది. జులై 13వ తేదీ నుంచి 15వ తేదీ మధ్యలో భారత్‌ పంపే ఓ మౌక శ్రీలంకకు చేరుకుంటుంది. జులై 29 నుంచి 31వ తేదీలోపు భారత్ పంపే మరో నౌక  శ్రీలంకకు వెళ్లనుంది.

అలాగే ఆగస్టు  రెండో వారంలో కూడా భారత్‌ శ్రీలంకకు ఇంధనం పంపే అవకాశం ఉంది. శ్రీలంక దౌత్యవేత్త మిలింద మోరగోడ ఇటీవల ఇండియాకు వచ్చి భారత పెట్రోలియం శాఖ మంత్రి హరిదీప్‌సింగ్‌ పూరితో భేటీ అయ్యారు. శ్రీలంకను ఆదుకోవాలని కోరారు. ఆ చర్చల ఫలితంగా  భారత్‌ ఇంధనం పంపి శ్రీలంకను ఆదుకోవాలని నిర్ణయించింది. ఇండియా ఇప్పుడే కాదు.. గత మూడు నెలలుగా శ్రీలంకకు అనేక విధాలుగా సాయం చేస్తూనే ఉంది. ఇండియా నుంచి దాదాపు 4,00,000 టన్నుల చమురు వివిధ దశల్లో శ్రీలంకకు చేరింది.

అలాగే ఈ నెలలో 33 వేల మెట్రిక్‌ టన్నుల గ్యాస్‌ను కూడా ఇండియా నుంచి శ్రీలంకకు సరఫరా చేయబోతున్నారు. అలాగే వచ్చే నాలుగు నెలల్లో ఇండియా నుంచి గ్యాస్ సరఫరా లక్ష టన్నులకు చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. భారత ప్రభుత్వమే కాదు.. ఇండియాలోనే అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా శ్రీలంక పరిస్థితి చూసి చలించిపోయి సాయానికి ముందుకు వస్తున్నాయి. సంక్షోభం గుప్పిట చిక్కిన శ్రీలంకకు భారత సంస్థలు బాసటగా నిలుస్తున్నాయి.

ఎందుకంటే.. శ్రీలంకతో మనకు ఎంతో చారిత్రక, పౌరాణిక బంధం ఉంది కదా.. పొరుగు దేశం శ్రీలంక కష్టాల్లో ఉంటే భారత్‌ వంటి పెద్ద దేశం చూస్తూ ఊరుకోకూడదు కదా. ప్రజాస్వామ్యం, సుస్థిరత సహా ఆర్థికంగా కోలుకోవడానికి భారత్‌ పూర్తిగా మద్దతు ఇస్తుందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ ప్రకటించారు కూడా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: