అదొక్కటి మినహా వైసీపీ నేతలు అన్నీ కబ్జా చేస్తున్నారా?

ఆంధ్ర ప్రదేశ్ లో అప్రకటిత ఎమర్జెన్సీ సాగుతోందని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ ఆరోపించారు. ప్రచారం సమయంలో అందరి తలల మీదా చేతులు పెడితే ఏదో అనుకున్నారని.. కానీ.. పాలన‌ మొదలయ్యాక నెత్తిన చెయ్యి పెట్టాడని అర్ధమైందని ఆయన విమర్శించారు.. ఒక్క నవరత్నాలకు అరాకొరా తప్ప కనీసం రోడ్లు వేయటానికి కూడా నిధులు లేవని సత్యకుమార్ విమర్శించారు. ఒక్క సముద్రం మినహా అన్నీ కబ్జా చేస్తున్నారు.

కేంద్ర పథకాలన్నిటికీ జగనన్న పేరు తగిలిస్తున్నారన్న సత్యకుమార్.. కేంద్రం ద్వారా రోజుకు కోటి లీటర్ల పాలు అంగన్వాడీల ద్వారా ఇవ్వాలని, కానీ అరవై లక్షల లీటర్లే ఇస్తున్నారని విమర్శించారు.  మిగతావి పిల్లల కడుపుకొట్టి స్వాహా చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణ, ఏపీల్లొ వారసత్వ రాజకీయాలతో  నేతల ఆస్తులు పెరుగుతున్నాయన్న సత్యకుమార్.. వారి కుటుంబాలకే పదవులు లభిస్తున్నది ప్రజలు గమనిస్తున్నారన్నారు.

విశాఖలో బిజెపి ఆధ్వర్యాన ఏయులో ఎమర్జెన్సీ వ్యతిరేక దినోత్సవం జరిగింది. ఇందులో పాల్గొన్న ఎమ్మెల్సీ, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాధవ్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిన రోజు ఇదన్నారు. ఎమర్జెన్సీ కాలంలో పత్రికా స్వాతంత్ర్యం సహా హక్కులన్నీ హరించారని, జనసంఘ్ కార్యకర్తలు నాడు చేతిరాతతో కరపత్రాలు రాసి పంచారని మాధవ్ గుర్తు చేసుకున్నారు.  చరిత్ర పుస్తకాలలో ఎమర్జెన్సీ అకృత్యాల గురించి ఏమీ రాయకపోవటం దారుణమని మాధవ్ విమర్శించారు. విచిత్రం ఏంటంటే.. బీజేపీ నేతలు వైసీపీని, జగన్ పాలనను ఇంతగా విమర్శిస్తున్నా.. కేంద్రంలో బీజేపీ నేతలతో జగన్ సత్సంబంధాలు మాత్రం యథావిధిగానే సాగుతున్నాయని చెప్పాలి.

 
అలాగే.. ఎప్పుడూ వివాదాల్లో ఉండే.. రామ్‌ గోపాల్ వర్మ ఇటీవల ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిని ద్రౌపది ముర్ముపై వివాదాస్పద పోస్టు పెట్టిన సంగతి తెలిసిందే. దీనిపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.  ఆనాడు దేశంలో ఇందిరా గాంధీ ఎమర్జెన్సీలో వాక్ స్వాతంత్ర్యం హరిస్తే ఈనాడు అది ఎక్కువై రాంగోపాల్ వర్మ వంటివారు రాష్ట్రపతి అభ్యర్థిమీదే అవాకులు చెవాకులు పేలుతున్నారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

YCP

సంబంధిత వార్తలు: