ఒక్క ఎమ్మెల్యే ఆ మాట అన్నా.. సీఎం రాజీనామా?

మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతోంది. సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా ఖాయంగా కనిపిస్తోంది. ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలోని అసమ్మతి శిబిరానికి శివసేన ఎమ్మెల్యేల తాకిడి పెరుగుతోంది. శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్‌ శిందే నేతృత్వంలో ఇప్పటికే అసమ్మతి శిబిరం ఏర్పాటైన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు సూరత్‌ నుంచి గువాహటికి చేరుకున్నారు.

మరో ఇద్దరు శివసేన ఎమ్మెల్యేలు కూడా సూరత్‌ బాటపట్టారు. ప్రస్తుతం స్వతంత్రులతో కలిపి 46 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందనిన శిందే అంటున్నారు. మిగతా శివసేన ఎమ్మెల్యేలూ తనతో కలిసి వస్తారని ఏక్‌నాథ్‌ శిందే నమ్మకంతో ఉన్నారు. అయితే.. ఇదంతా బీజేపీ ప్లాన్ అని వస్తున్న విమర్శలను ఆయన కొట్టి పారేశారు. బీజేపీ నుంచి తనకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని శిందే చెబుతున్నారు.

అయితే.. సొంతపార్టీలోని ఈ తిరుగుబాటుతో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే తీవ్రంగా కలత చెందారు. సీఎం అధికారిక నివాసం వర్ష ను ఖాళీ చేసిన మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే... అక్కడి నుంచి బాంద్రాలోని సొంత నివాసం మాతోశ్రీకి వెళ్లిపోయారు. అసంతృప్త నేతలు కోరితే శివసేన అధినేత పదవి త్యాగానికి కూడా సిద్ధమన్న ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించడం విశేషం.

అయితే పదవి నుంచి దాదాపు దిగిపోయిన శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే.. తమ పార్టీ  ఎప్పుడూ హిందుత్వను వదిలిపెట్టలేదని.. హిందుత్వ అనేది మా గుర్తింపు, భావజాలం అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ముఖ్యమంత్రిగా నా విధులు సమర్థంగా నిర్వహించానని.. రాజీనామా లేఖ నా వద్ద సిద్ధంగా ఉందని.. ముఖ్యమంత్రి పదవి కోసం పోరాటం చేయనని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రకటించారు. నేను సీఎంగా ఎమ్మెల్యేలు వద్దనుకుంటే రాజీనామా చేస్తానని ఉద్ధవ్‌ ఠాక్రే అన్నారు. నా తర్వాత కూడా శివసేన నేత సీఎం అయితే సంతోషిస్తానంటూ శిందేకు లైన్ క్లియర్ చేశారు. తనకు అనుకోకుండా సీఎం పదవి దక్కిందన్న ఉద్ధవ్‌ ఠాక్రే.. సీఎం పదవికి సరిపోనని ఒక్క ఎమ్మెల్యే అన్నా రాజీనామా చేస్తానన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: