ఆ గిరిజనుల ప్రాణాలంటే లెక్కలేదా?

అది శ్రీకాకుళం జిల్లాలోని మారుమూల పల్లె.. అక్కడి ప్రాణాలకు ప్రభుత్వానికి విలువలేనట్టుంది.. అక్కడ ఎలుగు బంట్లు వచ్చి మనుషులను చంపేస్తున్నా.. పట్టించుకునేవారే కనిపించరు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో ఎలుగుబంట్లు హడలెత్తిస్తున్నాయి. ఆదివారం ఓ గ్రామస్తుడిని పొట్టనపెట్టుకుంది కూడా. ఇక సోమవారం మరో ఆరుగురిపై దాడి చేసి దారుణంగా గాయపరిచింది. ఎలుగు దాడిలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఇప్పుడు చావుబతుకుల్లో కొట్టుమిట్టాడుతున్నారు.

తమ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నా.. తమ గోడు పట్టించుకునేవారే లేరని స్థానికులు వాపోతున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో ఎలుగుబంటి గ్రామస్తులపై పాశవికంగా దాడి చేస్తోంది. వజ్రపుకొత్తూరు మండలం కిడిసింగిలో రెండు రోజుల వ్యవధిలోనే దాడులు చేసింది. ఆదివారం ఎలుగు బంటి దాడిలో కోదండరావు అనే వృద్ధుడు చనిపోయాడు. ఆ ఘటన మరిచిపోక ముందే... మరోసారి ఎలుగుబంటి బీభత్సం సృష్టించింది.

తాజాగా సోమవారం ఎలుగు బంటి దాడిలో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. నలుగురు వ్యక్తుల ముఖాలపై ఎలుగుబంటి పాశవికంగా దాడి చేసింది. వరుసగా రెండోరోజు కూడా ఎలుగు దాడి చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. ఎలుగుబంటి దాడికి గురైన వారిని మొదట పలాస ఆసుపత్రికి తరలించారు. తర్వాత  మెరుగైన వైద్యచికిత్స కోసం శ్రీకాకుళంలోని మెడి కవర్‌ ఆసుపత్రికి తరలించారు. ఎలుగు దాడిలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

తీవ్ర గాయాలతో ప్రైవేట్‌ ఆసుపత్రిలో ఉన్న ఐదుగురి చికిత్స కోసం ప్రభుత్వం సాయం చేయాలని వజ్రపు కొత్తూరు ప్రాంత వాసులు కోరుతున్నారు. ఇలాంటి దాడులు తరచూ జరుగుతున్నా అటవీశాఖ చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు వాపోతున్నారు. మావి ప్రాణాలు కావా.. మా ప్రాణాలంటే లెక్కలేదా అని ఆవేదనగా మాట్లాడుతున్నారు. మరి వీరి ప్రశ్నలకు సమాధానాలు ఎవరు ఇస్తారో చూడాలి.. తాజాగా ఎలుగు దాడిలో పరిస్థితి విషమంగా ఉన్న వారంతా నిరుపేద కూలీలే కావడం గమనార్హం.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: