జగన్‌కు కొత్త తలనొప్పి.. తాళాల నిరసన?

జగన్ సర్కారుకు ఇప్పుడు మరో కొత్త తలనొప్పి ఎదురవుతోంది. అనేక జిల్లాల్లో పంట పరిహారం సొమ్ములు సరిగ్గా రాలేదంటూ నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. ఇలాంటి అసంతృప్త రైతులు అంతా రైతు భరోసా కేంద్రాలను, గ్రామ సచివాలయాలను టార్గెట్ చేస్తున్నారు. అక్కడకు వెళ్లి తాళాలు వేస్తున్నారు. దీంతో మీడియాలో ఈ వార్తలు హైలెట్ అవుతున్నాయి. మిర్చి పంటకు పరిహారం చెల్లింపుల్లో అక్రమాలు జరిగాయంటూ బాపట్ల జిల్లా యద్దనపూడి మండలం పెదజాగర్లమూడిలోనూగ్రామ సచివాలయానికి రైతులు తాళం వేసారు.

నష్టపోయిన రైతుకు ఖాతాల్లో నష్టపరిహారం వేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుందని క్షేత్రస్థాయిలో ఇందుకు భిన్నంగా ఉందని రైతులు ఆరోపిస్తున్నారు. యద్దనపూడి మండలంలో 1200 ఎకరాల్లో మిరప సాగుచేసిన రైతులు పూర్తిగా నష్టపోయారట. లక్షల రూపాయలు ఖర్చుచేస్తే నష్టపరిహారం అందలేదని రైతులు చెబుతున్నారు. గ్రామ సభపెట్టి ఏమేరకు నష్టపోయారో రైతులతో చర్చించి నష్ట పరిహారం అందిసే బాగుంటుందంటున్నారు.

ప్రభుత్వం చేతకానితనం వల్ల వందలాది మంది అన్నదాతలు నష్టపోయారని రైతులు ఆవేదన వ్యక్తంచేశారు. అందుకే గ్రామ సచివాలయానికి బాధిత రైతులు తాళం వేసి నిరసన వ్యక్తం చేశారు.. అయితే ఇలాంటి సీన్లు ఇప్పుడు ఏ ఒక్క జిల్లాలోనో పరిమితం కావడం లేదు. అన్ని జిల్లాల్లోనూ ఏదో ఒక చోట ఇలాంటి ఆందోళనలు జరుగుతూనే ఉన్నాయి. లక్షల సంఖ్యలో లబ్ది దారులు ఉంటున్నప్పుడు అక్కడక్కడ పొరపాట్లు జరగడం సహజమే. అయితే.. అలాంటి పొరపాట్లను అధికారులు క్రమంగా సరిదిద్దాల్సి ఉంటుంది.

కానీ.. ఆ పొరపాటు జరిగిన ప్రాంతంలో జరిగే ఆందోళనలు మీడియాలో హైలెట్ అవుతున్నాయి. అందులోనూ జగన్ సర్కారు అంటే పీకలదాకా కోపం ఉన్న టీడీపీ అనుకూల మీడియాకు ఇలాంటి ఆందోళనలు దొరికితే ఇక పండగేనని వేరే చెప్పనక్కర్లేదు.. ఇప్పుడు ఏపీలో ఇదే జరుగుతోంది. ఎక్కడ ఓ చిన్న ప్రజా ఆందోళన జరిగినా ఈ టీడీపీ అనుకూల మీడియాలో హైలెట్ అవుతోంది. అదీ మంచిదే కదా.. ఇలాంటి ఆందోళనలు దృష్టికి రాగానే తప్పు సరిదిద్దుకుంటే ప్రభుత్వం కూడా మంచి పని చేసినట్టు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: