జగన్ అసమర్థతను.. అంబటి బయటపెడుతున్నారా?

అంబటి రాంబాబు ఇటీవల మంత్రి వర్గంలో చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అందులోనూ కీలకమైన నీటి పారుదల శాఖను అంబటికి జగన్ కట్టబెట్టారు. అయితే.. అలాంటి అంబటి పదే పదే జగన్ అసమర్థను బయటపెడుతున్నారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు.  పోలవరం ప్రాజెక్టు, డయాఫ్రమ్ వాల్ గురించి పదే పదే మాట్లాడి జగన్ రెడ్డి అసమర్ధను, చేతగాని తనాన్ని సమర్థవంతంగా బయట పెడుతున్న అంబటిని అభినందించకుండా ఉండలేకపోతున్నానని టీడీపీ నేత అయ్యన్న పాత్రుడు తాజాగా ఎద్దేవా చేశారు.

మంత్రి అంబటి రాంబాబుకు నోటిపారుదలే తప్ప నీటిపారుదలపై అవగాహన లేని కబుర్లు విడ్డూరంగా ఉన్నాయని అయ్యన్న పాత్రుడు అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు 72 శాతం కట్టిన తెదేపాకు 28 శాతం కూడా పూర్తి చెయ్యలేని వాళ్ళు సవాల్ విసరడం వింతగా ఉందని అయ్యన్న పాత్రుడు విమర్శిస్తున్నారు. జగన్ రెడ్డి ధన దాహం వలనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆగిపోయిందని అయ్యన్న పాత్రుడు ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడం జగన్ రెడ్డి రివర్స్ టెండరింగ్ పాపమే అని అయ్యన్న పాత్రుడు ఆక్షేపించారు.

రివర్స్ టెండరింగ్ వద్దని కేంద్రం మొత్తుకున్నా జగన్ వినలేదని... జెట్ స్పీడ్ తో పూర్తి చేస్తామని చేతులెత్తేశారని అయ్యన్న పాత్రుడు మండిపడ్డారు. పోలవరం హెడ్ వర్క్స్ పూర్తి చెయ్యడానికి 1771 కోట్లు అవసరమైతే రివర్స్ టెండరింగ్ ద్వారా ఓ కంపెనీ 1548 కోట్లకే పని పూర్తి చేస్తుందని, దాని ద్వారా 223 కోట్లు ప్రజాధనం మిగిలిపోయిందని అసత్య ప్రచారం చేశారని అయ్యన్న పాత్రుడు  అంటున్నారు. ఇప్పుడు వ్యయం 1917 కోట్లకు పెరిగిందని గుర్తు చేశారు. వాస్తవ అంచనా కంటే 146 కోట్లు ప్రజా ధనం రివర్స్ టెండరింగ్ ద్వారా వృథా అయ్యిందని అయ్యన్న పాత్రుడు ధ్వజమెత్తారు.

2019 నవంబర్ లోనే రివర్స్ టెండరింగ్ ప్రక్రియ పూర్తి చేసి సదరు కంపెనీకి అప్పజెప్పారన్న అయ్యన్న పాత్రుడు ... నవంబర్ లో వరద ఉండదు కాబట్టి అప్పుడే పనులు పూర్తి చేసి ఉంటే కాఫర్ డ్యామ్ పూర్తి అయ్యేదని అభిప్రాయపడ్డారు. 2019లో 14 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా డయాఫ్రమ్ వాల్ నిలబడిందని గుర్తు చేసిన అయ్యన్న... 2020లో 23 లక్షల క్యూసెక్కుల వరద రావడంతోనే డయాఫ్రమ్ దెబ్బతిందని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: