ఉక్రెయిన్‌: సాయం చేస్తున్నారా.. సర్వనాశనం చేస్తున్నారా?

రష్యా ఉక్రెయిన్ దేశంపై దాడులు కొనసాగిస్తూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా ఈ యుద్దం జరుగుతోంది. అయితే.. ఉక్రెయిన్‌కు నాటో దేశాలు సాయం చేస్తున్నాయి. ఉక్రెయిన్ కు యుద్ధంలో అండగా నిలుస్తున్నాయి. రష్యాను ఉక్రెయిన్ ఓడించే వరకూ సాయం చేస్తామని చెబుతున్నాయి. ఐరోపా సమాఖ్య లో చేరాలని తహతహలాడుతున్న ఉక్రెయిన్‌కు కూడా యూరోపియన్‌ కమిషన్‌ ఓకే చెప్పేసింది.  ఆ దేశాన్ని సమాఖ్యలో చేర్చుకోవటానికి అంగీకరించింది. ఉక్రెయిన్‌కు ఈయూ అభ్యర్థిత్వ హోదా ఇస్తున్నట్లు ప్రకటించేసింది.

అయితే ఈయూలో సభ్యత్వం పొందాలంటే ఉక్రెయిన్ కు అంత సులభమేమీ కాదు.. ఈయూ నిబంధనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌.. తమ దేశంలో సంస్కరణలు తేవాలి.. ప్రజాసామ్య సంస్థలను ఉక్రెయిన్ బలోపేతం చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న చట్టాలను పారదర్శకంగా రూపొందించాల్సి ఉంటుంది. అలాగే  మానవహక్కులను పాటించాల్సి ఉంటుంది. అయితే.. ఈయూ అభ్యర్థి దేశం హోదాలో ఉక్రెయిన్‌కు స్వాగతిస్తున్నామని యూరోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డెర్‌ లెయెన్‌ ప్రకటన పట్ల ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెల్‌న్‌స్కీ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈయూ సభ్యత్వ మార్గంలో తొలి అడుగు పడిందని..  ఇది కచ్చితంగా తమను విజయానికి చేరువ చేస్తుందని జెలెన్‌ స్కీ అంటున్నారు. చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఈయూ దేశాలకు ఉక్రెయిన్‌ అధ్యక్షుడు థ్యాంక్స్ చెప్పారు. అలాగే బ్రిటన్‌ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ మళ్లీ ఉక్రెయిన్‌ వచ్చి అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. అలాగే కీవ్‌ నగరంలో పదివేల మంది సైనికులకు శిక్షణ ఇచ్చే కేంద్రాన్ని బోరిస్ ప్రారంభించారు.

మొత్తానికి నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తున్నాయా.. రష్యాతో యుద్ధం ముగియకుండా ఆజ్యం పోస్తున్నాయా అన్న అనుమానాలు కూడా తలెత్తుతున్నాయి. ఇలాగే నాటో దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేస్తే.. ఆ దేశం ముందు ముందు నామరూపాలు లేకుండా పోతుందేమో అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. చూడాలి.. ముందు ముందు ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: