ఇండియాకు ఇది గట్టి వార్నింగ్‌..ఇకనైనా మేలుకుంటారా?

పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే.. అది మనల్ని కాపాడుతుంది.. కానీ.. పెరుగుతున్న కాలుష్యం, గ్లోబల్ వార్మింగ్‌, టెక్నాలజీ.. ప్లాస్టిక్ వినియోగం వంటి అనేక కారణాలతో మనం పర్యావరణాన్ని నాశనం చేసుకుంటున్నాం.. దీని తీవ్రత ఎలా ఉందో.. తాజాగా ‘భారత పర్యావరణ స్థితి 2022: గణాంకాలు చెబుతున్నాయి. ఈ నివేదికను శాస్త్ర, పర్యావరణ కేంద్రం సీఎస్‌ఈ రూపొందించింది.

దీని ప్రకారం.. 1990 - 2018 మధ్య దేశ తీర ప్రాంతంలో మూడింట ఒక వంతు కోతకు గురైందట. నదీ జలాల పర్యవేక్షణ కోసం నిర్వహిస్తున్న ప్రతీ నాలుగు కేంద్రాల్లో మూడింట సీసం, ఇనుము, నికెల్, కాడ్మియం, ఆర్సెనిక్, క్రోమియం వంటి అత్యంత విషపూరిత లోహాల పరిమాణం ప్రమాదకర స్థాయిలో నమోదవుతోందట. 117 నదులు, ఉప నదుల్లో కనీసం 2 విషపూరిత లోహాలు ఎక్కువ స్థాయిలో నమోదయ్యాయట. అంతే కాదు.. 2030 నాటికి దేశంలోని 45 నుంచి 64 శాతం అటవీ విస్తీర్ణం పర్యావరణ పరంగా తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందట.

ఇంకో షాకింగ్‌ విషయం ఏంటంటే.. 2019-20లో మన దేశం 35 లక్షల టన్నుల ప్లాస్టిక్‌ను ఉత్పత్తి చేసిందట. అయితే.. అందులో కేవలం 12 శాతాన్నే పునర్వినియోగానికి పంపింది. అందులో 20 శాతాన్ని కాల్చి వేసింది. దీని వల్ల పర్యావరణ కాలుష్యం విపరీతంగా పెరుగుతుంది. ఇక మిగిలిన ప్లాస్టిక్‌ చెత్త కుండీల పాలై ఉంటుంది. ఇలా చెత్తలో కలిసిన ప్లాస్టిక్‌ అనేక రూపాల్లో కాలుష్యానికి కారణం అవుతుంది.

మిగిలిన అన్ని వ్యర్థాల కంటే ప్లాస్టిక్‌ ప్రమాదకరమైందన్న విషయం తెలిసిందే. అందుకే ప్లాస్టిక్‌ వ్యర్థాల నియంత్రణ కోసం ప్రభుత్వాలు ఎన్నో నిబంధనలను రూపొందిస్తున్నాయి. ప్లాస్టిక్ కవర్ల వినియోగం పై ఆంక్షలు పెడుతున్నాయి. కానీ..ఇంకా వీటి వినియోగం మాత్రం కంట్రోల్‌ కావడం లేదు. తాజాగా ఈ నివేదికలు చెబుతున్న విషయాలు చూస్తే.. మన చేతులతో మనమే ఈ పుడమిని నాశనం చేసుకుంటున్నామని చెప్పక తప్పదు.. అందుకే ఇకనైనా ఇండియా మేలుకోవాల్సిన అవసరం ఉంది. ఇండియా అంటే మనమే అన్న సంగతి మర్చిపోకూడదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: