వైసీపీ స్కోరు 175 కాదు.. 30 మాత్రమేనా?

ఏపీలో ఎన్నికల కల వచ్చేసింది. రెండేళ్ల ముందు నుంచే ఏపీలో ఎన్నికల ఫీవర్ కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా 175కు 175 సీట్లు గెలవాలని జగన్ సొంత పార్టీ నేతలకు టార్గెట్ పెట్టేశారు. అయితే.. జగన్ పార్టీలో బలం నింపేందుకు అలా మాట్లాడారన్న సంగతి అందరికీ తెలిసిందే. అది అసాధ్యమన్న టార్గెట్‌ కూడా అందరికీ తెలిసిందే. అసలు జగన్ పార్టీ గత ఎన్నికల్లో సాధించిన 151 సీట్లను మళ్లీ నిలబెట్టుకున్నా అదో గొప్ప రికార్డే అవుతుంది.

ఏపీలో మ్యాజిక్‌ ఫిగర్‌ 88 అసెంబ్లీ సీట్లు.. ఆమాత్రం సాధిస్తే అధికారం సాధించేయొచ్చు.. కానీ జగన్ మాత్రం 175 రావాల్సిందేనని పార్టీ క్యాడర్‌కు చెబుతూ కాన్ఫిడెన్స్ పెంచే పనిలో ఉన్నారు. అయితే. వైసీపీకి అంత సీన్ లేదని.. ముఖ్యమంత్రి జనగ్ ఈసారి 175 సీట్లు రావాలని కలలు కంటున్నారని... కానీ వైసీపీకి 30 సీట్లు వస్తే గొప్పేనని విపక్షాలు కామెంట్ చేస్తున్నారు. ఈ సీట్ల లెక్కలపై జనసేన కీలక నేత నాదెండ్ల మనోహర్ స్పందించారు. ప్రభుత్వం నిర్వహిస్తున్నగడప గడపకూ కార్యక్రమం వల్ల ఉపయోగం లేదంటున్న నాదెండ్ల మనోహర్‌ జగన్ కలకు కల్లలుగానే మిగులుతాయన్నారు.

వచ్చే ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తామంటున్న నాదెండ్ల మనోహర్.. జనసేన పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదని..ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యమని అంటున్నారు. దుర్మార్గమైన రాజకీయ వ్యవస్థను మార్చేందుకు అందరూ కలిసిరావాలని పిలుపు ఇస్తున్నారు. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో 132మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారని.. ఇది రైతుల దయనీయ పరిస్థితికి అద్దం పడుతుందని మనోహర్ అన్నారు.

రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు అటకెక్కాయన్న మనోహర్.. కనీసం రోడ్లు కూడా వేయటం లేదని విమర్శించారు. కోనసీమ అల్లర్లలో మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడి జరిగితే ముఖ్యమంత్రి నుంచి కనీస స్పందన లేదని... ఆయన మనసులో ఎలాంటి దురాశ ఉందో ప్రజలు అర్ధం చేసుకోవాలని నాదెండ్ల మనోహర్ అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వైసీపీకి 30 సీట్లు వచ్చినా గొప్పే అని నాదెండ్ల మనోహర్ అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: