పవన్ కల్యాణ్‌కు ముందస్తు భయం పట్టుకుందా?

జనసేన వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలనే ఆలోచనతో ఉంది. ఇప్పటి వరకూ పాలిటిక్స్‌ను పార్ట్ టైమ్ వ్యవహారంగా భావించినా.. ఇక ముందు మాత్రం సీరియస్‌గా తీసుకోవాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నట్టున్నారు. అయితే.. ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. వాస్తవానికి అప్పుడే ఎన్నికల వాతావరణం వచ్చే అవకాశం లేదు. కానీ.. ఎందుకో పవన్ కల్యాణ్ మాత్రం ఇప్పటి నుంచే కంగారు పడుతున్నారు.

మొన్నటికి మొన్న వచ్చే ఎన్నికల్లో పొత్తుల విషయంపై కీలక ప్రకటన చేశారు. వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనంటూ టీడీపీకి ఆశలు రేపినట్టే రేపి.. మళ్లీ ఈసారి జనసేన తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఇక ఇప్పుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ దసరా నుంచి పవన్ కల్యాణ్‌ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాలని నిర్ణయించుకున్నారు. మరి ఎన్నికలకు రెండు ఏళ్ల ముందు నుంచే పర్యటించడం అంటే ఎన్నికల శంఖారావం పూరించడమే అవుతుంది.

మరి ఎందుకు పవన్ కల్యాణ్ ఇంత త్వరగా యాత్ర ప్రారంభిస్తున్నారని ఆలోచిస్తే.. అందుకు ఆయనకు పట్టుకున్న ముందుస్తు భయమే కారణంగా తెలుస్తోంది. ముందుస్తు ఎన్నికలు 2023 మార్చిలో వచ్చే అవకాశం ఉందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అందుకే జనసేన పార్టీ కార్యకర్తలు ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ నేతలు పిలుపు ఇస్తున్నారు. ఆ పార్టీ కీలక నేత నాదెండ్ల మనోహర్ కూడా అదే మాట చెబుతున్నారు. వచ్చే ఏడాది మార్చిలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని చెప్పిన మనోహర్.... ఎన్నికలు ఎప్పుడొచ్చినా ఎదుర్కొనేందుకు సన్నద్ధం కావాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

అదే నిజమైతే కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉంటుంది. అందుకే అన్ని రకాల వ్యూహాలతో సిద్ధం కావాలని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. అప్పులు తప్ప ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి లేదని.. అందుకే ముందస్తు ఎన్నికలకు వెళ్తున్నారని పవన్ టీమ్‌ విమర్శిస్తోంది. ఏదేమైనా పవన్ కల్యాణ్ మాత్రం ఏపీలో ముందస్తు ఎన్నికలు వస్తాయని బలంగా నమ్ముతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: