సేమ్‌సీన్‌: జగన్ నోట.. అదే చంద్రబాబు డైలాగ్‌ ?

అధికారంలో ఉన్నవారు.. ఎప్పుడూ తామే అధికారంలో ఉన్నామని కలలు కంటారు. ఇది చాలా సహజం అనుకుంటా.. ఇప్పుడు జగన్ ను చూస్తే అలాగే కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 151 సీట్లు వచ్చాయని వచ్చే ఎన్నికల్లో 175 కి 175 సీట్లు సాధించాలని అదే మన లక్ష్యమని జగన్ తాజాగా పార్టీ నేతలకు టార్గెట్ విధించారు. అంతే కాదు.. రాష్ట్రంలోని 87శాతం కుటుంబాలకు పథకాలు చేరాయని సీఎం జగన్ అంటున్నారు.

ఈ మాటలు వింటే.. గతంలో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు మాట్లాడిన మాటలు గుర్తొస్తున్నాయి. గతంలో చంద్రబాబు డ్యాష్‌ బోర్డు ఒకటి రూపొందించి దాని ప్రకారం నిర్ణయాలు తీసుకునేవారు.. ఆ డ్యాష్‌ బోర్డు సమాచారంలో రాష్ట్రం 90 శాతం మంది సంతృప్తిగా ఉన్నారు అనే సమాచారం వచ్చేది. అది చూసి చంద్రబాబు ఖుషీ అయ్యేవారు.. మళ్లీ తమదే అధికారం అనుకునేవారు.. కానీ.. ఆ తర్వాత ఏమైంది.. 175కు కేవలం 23 సీట్లు మాత్రమే వచ్చాయి.

మరి అంతగా వచ్చిన 90 శాతం సంతృప్తి అనే సమాచారం ఎక్కడి.. అది తప్పుడు సమాచారమా.. అంటే.. అధికారులు సేకరించే సమాచారం అలాగే ఉంటుంది. దాన్ని నమ్మి అంతా బావుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే.. చంద్రబాబు విషయంలో అదే జరిగింది. అలాగే ఇప్పుడు సీఎం జగన్ కూడా 87 శాతం కుటుంబాలకు తమ పథకాలు అందాయని చెప్పుకుంటున్నారు. అయితే ఇక్కడ ఓ తేడా ఉందని.. చంద్రబాబు ప్రభుత్వం నుంచి డాటా తెప్పించుకునేవారు.

అధికారులు మోహమాటం కోసం చంద్రబాబు మెప్పు కోసం.. చంద్రబాబుతో తిట్లు తినకుండా ఉండేందుకు అంతా బావుందని నివేదికలు ఇచ్చేవారు.. కానీ.. జగన్ తెప్పించుకుంటున్న సమాచారం ప్రభుత్వం నుంచి కాదు.. ఇది ఐ ప్యాక్‌ అనే ప్రైవేటు సంస్థ నుంచి తెప్పించుకుంటున్న సమాచారం కాబట్టి.. ఇందులో తప్పులు లేకపోవచ్చు..  మరి ఈ సమాచారం నిజమేనా.. ఈ సమాచారం ప్రకారం.. 87 శాతం సంతృప్తిగా ఉన్నారా.. ఉంటే వాళ్లంతా వైసీపీకి ఓటేస్తారా.. వాళ్లంతా ఓటేసినా 175కు 175 సీట్లు సాధ్యమా.. చూడాలి.. ఏం జరుగుతుందో..?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: