దేవుడా.. ఏపీని కాపాడు.. పదిపైనా రాజకీయాలేనా?

ఏపీలో ఇటీవల పదో తరగతి ఫలితాలు వచ్చాయి.. అయితే. ఈ ఏడాది పాస్ పర్సంటేజీ దారుణంగా పడిపోయింది.. 67 శాతం మంది మాత్రమే పాసయ్యారు.. అసలు ఇంత తక్కువ పాస్ పర్సంటేజీ గత 20 ఏళ్లలో ఎన్నడూ లేదని నిపుణులు అంటున్నారు. అయితే అందుకు కారణాలేంటి.. ఈ పరిస్థితిని సరిదిద్దేందుకు ఏం చేయాలి.. ఏ జాగ్రత్తలు తీసుకోవాలి అనే అంశాలపై చర్చ జరగాలి.. కానీ.. ఏపీలో  చివరకు పదో తరగతి ఫలితాలు కూడా రాజకీయ వ్యవహారంగా మారిపోయాయి.

అమ్మ ఒడి, సంక్షేమ పథకాలకు విద్యార్థుల సంఖ్యను తగ్గించే కుట్రలో భాగంగానే పదో తరగతిలో అత్యధిక మందిని ప్రభుత్వం ఫెయిల్ చేసిందని టీడీపీ ఆరోపిస్తోంది. ఏపీలో విద్యా వ్యవస్థను భ్రష్టుపట్టించిన వైసీపీ సర్కార్ పరీక్షల నిర్వహణ లో ఫెయిలైందని లోకేశ్ మండిపడుతున్నారు. ఏపీలో 71 పాఠశాలల్లో ఒక్కరూ ఉత్తీర్ణులు కాలేదని.. 20 ఏళ్లలో అతి తక్కువగా 67.26 శాతం ఉత్తీర్ణత న మోదు కావడంలో ప్రభుత్వ కుట్ర కోణం కనిపిస్తోందని లోకేశ్ అంటున్నారు. చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులను నాడు-నేడు పనుల కి కాపలా పెట్టారని.. అందుకే పదో తరగతిలో ఉత్తీర్ణత తగ్గిందని లోకేశ్ అంటున్నారు.

ఈ ఆరోపణలను అధికార పార్టీ తిప్పికొట్టింది. టెన్త్ లో ఉత్తీర్ణత శాతం తగ్గడానికి నారాయణ సంస్థ ప్రశ్న పత్రాలను లీక్ చేయడమే కారణమంటున్నారు వైయ‌స్ఆర్‌సీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి. పిల్లల్ని అయోమయంలోకి నెట్టి మానసికంగా డిస్టర్బ్ చేసిన పాపం టీడీపీ నేతలదే అంటున్నారు. లోకేశ్‌ దిగజారి ఆరోపణలు చేయడంలో ముందుంటాడని.. చదువు కొన్న వాడివి. నువ్వు రిజల్ట్ గురించి మాట్లాడటం ఏమిటి? అంటూ విమర్శించారు.

అలాగే కలెక్టర్లకు టార్గెట్లు పెట్టి పిల్లలు ఫెయిలైతే చర్యలు తీసుకుంటామని గతంలో టీడీపీ ప్రభుత్వం  బెదిరించిందని గుర్తు చేశారు. కిందిస్థాయి నుంచి పైవరకు పాస్ పర్సెంటేజిని పెంచడానికి ఏం చేశారో తెలియదా అంటూ ఎద్దేవా చేశారు. మీ అండదండలున్న కార్పోరేట్ సంస్థల్లో చదివే పిల్లలు ఆలిండియా ర్యాంకర్లయ్యారని.. ఇప్పుడా ర్యాంకులు తగ్గాయని ఏడుపా బాబూ? అంటూ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇలా ఉంది ఏపీలో నేతల తీరు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: