ఆ విషయంలో మోదీ, జగన్‌ దొందూ దొందే?

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఏపీలో పర్యటిస్తున్నారు. ఏపీలో బీజేపీ క్యాడర్ పెంచుకోవాలని భావిస్తున్న నడ్డా.. ఇక్కడి అధికార పార్టీ తీరుపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ప్రత్యేకించి జగన్ సర్కారు చేస్తున్న అప్పులపై మండిపడ్డారు. జగన్ సర్కారు మూడేళ్లలోనే  8 లక్షల కోట్లు అప్పు చేసిందని జేపీ నడ్డా మండిపడ్డారు. అయితే  జేపీ నడ్డా ఏది మాట్లాడినా ఓకే కానీ అసలు అప్పుల గురించి వైసీపీని విమర్శంచే అర్హత కేంద్రానికి ఉందా అన్న ప్రశ్న తలెత్తుతుంది.

ఎందుకంటే.. మోడీ సర్కారు మొదటి సారి అధికారంలోకి వచ్చినప్పుడు అంటే..  2014లో భారత్‌ అప్పు 53 లక్షల కోట్లుగా ఉండేది. ఇప్పుడు చూస్తే  8 ఏళ్లలో ఆ అప్పు ఏకంగా కోటి 30 లక్షల కోట్లకు చేరింది. అంటే.. మోడీ 8 ఏళ్లలో ఏకంగా 80 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసేశారు. మరి కేంద్రం ఇంతగా అప్పులు చేసి.. రాష్ట్రాలను అప్పులు చేస్తున్నాయని విమర్శించడం రైటేనా అన్న ప్రశ్న తలెత్తక మానదు. ఇప్పుడు ఇదే విషయం ఏపీ మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రంలో మీరే అధికారంలో ఉన్నారు కదా..మరి మేం అంతగా అప్పులు చేస్తుంటే మీరేం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ఎదురుదాడి చేస్తున్నారు. ఏపీకి ఎంత అప్పు ఉన్నదన్నది మీకు తెలియదా.. ఒకవేళ ఏపీ పరిమితికి మించి అప్పులు చేస్తుంటే, కేంద్రం ఆర్థిక విభాగం, కేంద్ర ఆర్థిక మంత్రి ఏం చేస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. అసలు కేంద్రం ఏపికి ఇచ్చిన ఒక్క హామీ అయినా నెరవేర్చారా.. కులం, మతం పేరుతో తగవులు తప్ప ఏం సాధించారని మాజీ మంత్రి పేర్ని నాని అడుగుతున్నారు.

మసీదులు కూలగొట్టి, గుడులు కడతామని... మసీదులు తవ్వి శివలింగాలు తీస్తాం అనడం తప్ప బీజేపీ ఏం సాధించిందని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నిస్తున్నారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానని మోదీ చెప్పారని... మరి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని మాజీ మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. ఏపీలో దాదాపు 1.70 కోట్ల కుటుంబాలు ఉన్నాయి కదా.. వాటిలో ఎన్ని కుటుంబాలకు ఉద్యోగాలు ఇచ్చారో చెప్పాలని మాజీ మంత్రి పేర్ని నాని అడిగారు. జనధన్‌ ఖాతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్నారు కదా.. ఎక్కడైనా వేశారా అని మాజీ మంత్రి పేర్ని నాని అడిగారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: