జగన్‌కు.. ఆ రెండు కులాలు కొత్త శత్రువులా?

ఏపీలో రాజకీయం ఎక్కువగా కులం చుట్టూ తిరుగుతుందన్న సంగతి తెలిసిందే.. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కమ్మవారి హవా నడిచిందని చెప్పొచ్చు.. ఇప్పుడు జగన్‌ పాలనలో రెడ్డి రాజ్యం నడుస్తుందన్న టాక్ ఉంది. అయితే.. ఎవరి కాలంలో ఎవరి రాజ్యం నడిచినా.. ఇతరులను శత్రువులుగా చూసే కల్చర్ మాత్రం మంచిది కాదు. కానీ.. సీఎం జగన్ కమ్మ వారిని శత్రువులుగా చూస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అంటున్నారు.

అంతే కాదు.. ఇప్పుడు జగన్‌కు కమ్మ వారి తర్వాత మరో రెండు కులాలు శత్రువులుగా కనిపిస్తున్నాయంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు వేయని కులాల వారిని జగన్ వర్గ శత్రువుగా చూస్తున్నారంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. శెట్టి బలిజ, క్షత్రియ కులాల్ని ఇప్పుడు వైసీపీ వర్గ శత్రువులుగా చూస్తోందని విమర్శించారు.

కోనసీమలో ఘర్షణలు నివారించేలా, శాంతియుత వాతావరణం ఏర్పడేలా అక్కడి జనసేన నేతలు చొరవ తీసుకోవాలంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. శాంతి ర్యాలీలు చేపట్టి ప్రశాంత వాతావరణం కోసం పని చేయాలని సూచించారు. అన్ని కులాల వారితో కమిటిలు ఏర్పాటు చేసి ముందుకు వెళ్ళాలని.. ప్రభుత్వం చేయాల్సిన పనిని జనసేన తరపున చేద్దామని పవన్ కల్యాణ్ పిలుపు ఇచ్చారు.

ఇదే సమయంలో పవన్ కల్యాణ్‌ తన పార్టీ వైఖరిని అనేక విషయాల్లో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి కొనసాగాలంటున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌.. భవిష్యత్తులో అద్భుతమైన రాజదానిగా అభివృద్ధి చెందాలని అభిలషించారు. జనసేన అధికారంలోకి వస్తే అల్పాదాయ వర్గాలకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు.  తమకు అధికారం ఇస్తే.. లక్షమంది వ్యాపార వేత్తలను తయారు చేస్తామని.. తద్వారా 50 లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ అన్నారు. జనసేన అధికారంలోకి వచ్చాక సీపీఎస్ రద్దు చేస్తామన్న పవన్‌ కల్యాణ్.. వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర దక్కేలా అండగా ఉంటామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: