కేసీఆర్‌ ఆయువుపట్టుపై కొట్టిన మోడీ?

హైదరాబాద్‌ పర్యటనలో ప్రధాని నరేంద్ర మోడీ రాజకీయ విమర్శలు బాగానే ఎక్కు పెట్టారు. కేంద్రంపై కక్ష కట్టిన కేసీఆర్‌పై విమర్శనాస్త్రాలు బాగానే సంధించారు. హైదరాబాద్‌ ఐఎస్‌బీ ద్విదశాబ్ది వార్షికోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ బేగంపేట విమానాశ్రయంలో బీజేపీ  స్వాగత సభలో పాల్గొన్నారు. ఇక్కడ చేసిన ప్రసంగంలో మోడీ కేసీఆర్‌ను ఓ రేంజ్‌లో విమర్శించారు. తెలంగాణ పౌరుషం, పట్టుదలకు మారుపేరంటూ తెలుగులో ప్రసంగం ప్రారంభించిన మోదీ.. టీఆర్‌ఎస్‌ సర్కార్‌ను లక్ష్యంగా చేసుకున్నారు.

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు స్వాతంత్ర్య కాలంలోనే ఫలించలేదని.. ఇప్పుడూ ఫలించవని మోదీ వ్యాఖ్యానించారు. పరోక్షంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను టార్గెట్‌ చేసుకున్నారు. వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకంగా బీజేపీ పోరాటం కొనసాగుతుందని.. ఒక కుటుంబం మాత్రమే అభివృద్ధి చెందడానికి... తెలంగాణ ఉద్యమం జరగలేదని ఎద్దేవా చేశారు. సామ, దాన దండోపాయాలు ఉపయోగించి కుట్రలతో ఒక కుటుంబం రాష్ట్రాన్ని పాలించేందుకు ప్రజలు ఉద్యమించలేదని నరేంద్ర మోడీ విమర్శించారు.

కేంద్ర పథకాలు తెలంగాణలో లబ్ధిదారులకు అందకుండా కేసీఆర్‌ రాజకీయం చేస్తున్నారనిన ప్రధాని నరేంద్ర మోడీ విమర్శించారు. జనం కోసమే బతికే తమను జనం నుంచి దూరం చేయలేరని మోదీ అన్నారు. తెలంగాణలో ఈ సారి బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని... ఇక్కడ అధికారం  మారడం తథ్యమని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. తెలంగాణ భవిష్యత్‌ కోసమే బీజేపీ పోరాటం చేస్తోందని.. తెలంగాణ గౌరవం, స్వాభిమానం, గుర్తింపు కోసమూ.. పోరు సాగిస్తామని అన్నారు.

తాను విమానాశ్రయానికి వచ్చే సమయంలో తెలంగాణలో వాతావరణాన్ని గుర్తించానని.. బీజేపీ పోరాటానికి అనుకూల పవనాలు వీస్తున్నాయనే విషయం స్పష్టంగా కనిపిస్తోందని మోదీ అన్నారు. ఇటీవల వివిధ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయాలు ప్రజలు బీజేపీ వైపు ఉన్నారనే స్పష్టమైన సంకేతాలు పంపుతోందని ప్రధాని మోదీ అన్నారు. తెలంగాణలోనూ ఈసారి మార్పు తథ్యమన్న  విషయం ఖాయమైపోయిందని మోదీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: