మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు రాజ్య‌స‌భ సీటు... జ‌గ‌న్ సంచ‌ల‌న నిర్ణ‌యం వెన‌క‌..!

VUYYURU SUBHASH
వైసీపీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, గుంటూరు జిల్లా చిల‌క‌లూరిపేట నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌పై సీఎం జ‌గ‌న్ వ‌రాల వ‌ర్షం కురిపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌ను ప‌ట్టించుకోలేదని.. త‌న‌ను ప‌క్క‌న పెట్టార‌ని భావిస్తూ..వ‌చ్చిన ఆయ‌న‌పై జ‌గ‌న్ అక‌స్మాత్తుగా.. వ‌రాల‌వ‌ర్షం కురిపించారు. ఆయ‌న‌ను రాజ్య‌స‌భ‌కు పంపించేందుకు సిద్ధ‌మ‌య్యారు. తాజాగా వెలుగు చూసిన స‌మాచారం.. తాడేప‌ల్లివ‌ర్గాల క‌థ‌నం మేర‌కు..మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌ను రాజ్య‌స‌భ‌కు పంపించేందుకు జ‌గ‌న్ సంసిద్ధులైన‌ట్టు స‌మాచారం.

రాష్ట్రం నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు వి.విజయసాయిరెడ్డి, సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సురేష్‌ ప్రభుల ప‌ద‌వీ కాలం ఈ ఏడాది జూన్‌ 21తో  ముగియనుంది. ఈ నాలుగు స్థానాలకు ఫిబ్రవరి నెలాఖరు లేదా మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముంది.అయితే.. రాష్ట్ర అసెంబ్లీలో స‌భ్యుల బ‌లాబ‌లాల ఆధారంగా ఈ సీట్లు ద‌క్కుతాయి. దీనిని చూసుకుంటే.. వైసీపీకి భారీ మెజారిటీ ఉన్న‌నేప‌థ్యంలో ఈ నాలుగు స్థానాలు.. వైసీపీకే ద‌క్క‌నున్నాయి. ఈ క్ర‌మంలో సీఎం జ‌గ‌న్ ఈ విష‌యంపై గ‌త రెండు రోజులుగా దృష్టి పెట్టిన‌ట్టు స‌మాచారం.

పార్టీ కీల‌క నేత‌, ప్ర‌స్తుతం రాజ్య‌స‌భ స‌భ్యుడు విజయసాయిని మళ్లీ కొనసాగించే అవకాశం క‌నిపిస్తోంది. దీనికి సంబంధించి కూడా సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల క‌థ‌నం.  మిగిలిన మూడు స్థానాల్లో ఒక‌టి.. యూపీ, లేదా గుజ‌రాత్‌కు చెందిన కార్పొరేట్‌ దిగ్గజానికి ఇచ్చే అవకాశం ఉందని, దీనికి సంబంధించి కేంద్రంలోని పెద్ద‌ల నుంచి ఒత్తిడి ఉంద‌ని తెలుస్తోంది. ఇక‌, ఒక స్థానాన్ని గుంటూరు జిల్లాలో మూడేళ్ల నుంచి ఏ అవకాశమూ దక్కని సీనియర్‌ నేత మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు ఇవ్వాల‌ని జ‌గ‌న్ నిర్ణ‌యించిన‌ట్టు స‌మాచారం.

మ‌ర్రి గ‌త ఎన్నిక‌ల్లో చిల‌క‌లూరిపేట సీటు త్యాగం చేసినందుకు ఆయ‌న‌కు ఎమ్మెల్సీతో పాటు మంత్రి ప‌ద‌వి ఇస్తాన‌ని హామీ ఇచ్చారు. అయితే ఎన్నిసార్లు ఎమ్మెల్సీలు భ‌ర్తీ చేసినా కూడా జ‌గ‌న్ మ‌ర్రికి ఎమ్మెల్సీ ఇవ్వ‌లేదు. చివ‌ర‌గా స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో ఎమ్మెల్సీ ఇస్తాన‌ని జ‌గ‌న్ స్వ‌యంగా హామీ ఇచ్చారు. అయితే క‌మ్మ వ‌ర్గానికి కృష్ణా, ప్ర‌కాశం జిల్లాల నుంచి అవ‌కాశం ఇవ్వ‌డంతో మ‌ర్రికి ఆ ఛాన్స్ ద‌క్క‌లేదు.

ఇక ఇప్పుడు మ‌ర్రికి రాజ్య‌స‌భ ఇస్తే అమ‌రావ‌తి ఏరియాలో క‌మ్మ వ‌ర్గానికి సంతృప్తి ప‌రిచిన‌ట్ల‌వుతుంద‌ని జ‌గ‌న్ ప్లాన్‌. ఇటీవ‌ల విజ‌య‌వాడ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్ట‌డంతో ఈ వ‌ర్గంలో పార్టీ ప‌ట్ల కాస్త జోష్ వ‌చ్చింది. ఇక మ‌ర్రికి రాజ్య‌స‌భ సీటు ఇచ్చే అంశంపై ఇప్ప‌టికే ఆయ‌న‌కు కూడా సంకేతాలు వెళ్లాయ‌ని కూడా తాడేప‌ల్లి వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: