అద్భుతం.. ఆమ్ఆద్మీ పార్టీ ప్ర‌స్థానం..!

స‌మ‌కాలీన భార‌త రాజ‌కీయాల్లో ఆమ్ఆద్మీ పార్టీది ఒక విశిష్ట‌మైన స్థానం. సామాన్యుల పార్టీగా ఒక సామాన్యుడు స్థాపించిన పార్టీ ఇది. అవినీతికి పాల్ప‌డేవారికి క‌ఠిన శిక్ష‌లు ఉండేలా ప్ర‌త్యేకమైన చ‌ట్టాల కోసం  ద‌శాబ్ద కాలం క్రితం ప్రారంభ‌మైన ఉద్య‌మం నుంచి ఆవిర్భ‌వించిన పార్టీగా దీనికి గుర్తింపు ఉంది. జ‌న‌లోక్‌పాల్ బిల్లు కోసం అన్నాహ‌జారేతో క‌లిసి పోరాటం చేసిన అర‌వింద్ కేజ్రీవాల్ ఆధ్వ‌ర్యంలో ఏర్ప‌డిన ఈ పార్టీ అతికొద్ది కాలంలోనే జాతీయ పార్టీల‌కు కొన్ని రాష్ట్రాల్లో స‌వాల్ విసిరే స్థాయికి సాగించిన విజ‌య ప్ర‌స్థానం నిజంగా అద్భుత‌మేన‌ని చెప్పాలి. అన్నాహ‌జారే అభిప్రాయానికి భిన్నంగా అవినీతి వ్యతిరేక ఉద్య‌మాన్ని రాజ‌కీయ పార్టీగా మ‌లిచేందుకే నిర్ణ‌యించుకున్న మాజీ ఐఆర్ఎస్ అధికారి అర‌వింద్ కేజ్రీవాల్ 2012 న‌వంబ‌ర్ 26న ఢిల్లీ కేంద్రంగా ఆప్‌ను ప్రారంభించారు.

 
ఆ త‌రువాత ఏడాదే 2013లో మొద‌టిసారిగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేసి మంచి ఫ‌లితాల‌నే సాధించింది ఈ పార్టీ.  బీజేపీ తరువాత రెండో పెద్ద పార్టీగా నిలిచి కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసి తొలిసారి ముఖ్య‌మంత్రి అయ్యారు కేజ్రీవాల్. అయితే జ‌న్‌లోక్‌పాల్ బిల్లును లోక్ స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నందుకు నిర‌స‌న‌గా 49 రోజుల‌కే త‌న ప‌ద‌వికి రాజీనామా చేసి ప్ర‌భుత్వం ర‌ద్దుకు సిఫార్సు చేశారు. 2015లో జ‌రిగిన ఎన్నిక‌ల్లో మొత్తం 70 అసెంబ్లీ స్థానాల‌కు గాను 67 స్థానాల‌ను త‌న ఖాతాలో వేసుకున్న ఆప్‌ క‌ళ్లు చెదిరే విజ‌యం సాధించింది. బీజేపీని కేవ‌లం 3 స్థానాల‌కు ప‌రిమితం చేసింది. ఇక కాంగ్రెస్ తొలిసారిగా అక్క‌డ ఉనికిని కోల్పోయింది.  ఆత‌రువాత 2020లో  జ‌రిగిన ఎన్నిక‌ల్లో 62 సీట్ల‌తో మ‌రోసారి ఘ‌న‌విజ‌యం సాధించింది.
       

ఇక సంప్ర‌దాయ పార్టీల‌కు భిన్నంగా ధ‌న ప్ర‌భావానికి దూరంగా రాజ‌కీయాలు సాగిస్తున్న ఈ పార్టీ చండీఘ‌ర్‌, పంజాబ్ లోనూ ఇప్ప‌టికే బ‌ల‌మైన పార్టీగా ఎదిగింద‌న్న సూచ‌న‌లు క‌నిపిస్తుండ‌గా గోవా, ఉత్త‌ర ప్ర‌దేశ్‌ల్లోనూ త‌న ప్రాభ‌వాన్ని విస్త‌రించేందుకు ప్ర‌య‌త్నాలు సాగిస్తోంది. ఆమ్ ఆద్మీ పార్టీ త‌ర‌పున‌ పంజాబ్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిగా ఆ పార్టీ ఎంపీ భ‌గ‌వంత్‌మాన్ ను ప్ర‌క‌టించింది. ఇందుకుగాను వినూత్నంగా టెలీ ఓటింగ్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి అభిప్రాయాల‌ను సేక‌రించి అత్య‌ధిక మ‌ద్ద‌తు ల‌భించిన వ్య‌క్తిగా ఆయ‌న‌ను నిర్ణ‌యించ‌డం విశేషం. పంజాబ్‌లో ఆమ్ఆద్మీదే విజ‌య‌మ‌ని కొన్ని స‌ర్వేలు ఇప్ప‌టికే చెపుతున్న నేప‌థ్యంలో భ‌విష్య‌త్తులో మ‌రిన్ని రాష్ట్రాల్లోనూ ఆమ్ ఆద్మీ ప్రాభవం పెంచుకోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంది. అదే జ‌రిగితే వ‌చ్చే సార్వ‌త్రిక ఎన్నిక‌ల నాటికి విప‌క్షాల త‌ర‌పున ప్ర‌ధాని అభ్య‌ర్థిగా కేజ్రీవాల్ ఆవిర్భ‌వించినా ఆశ్చ‌ర్యం లేద‌న్న‌ది రాజ‌కీయ నిపుణుల అభిప్రాయం. రాజ‌కీయాల‌పై ప్ర‌జ‌ల్లో గూడుక‌ట్టుకున్న ఆగ్ర‌హ‌మే ఆప్ ఎదుగుద‌ల‌కు ప్ర‌ధాన కార‌ణంగా క‌నిపిస్తోంద‌న్న వారి విశ్లేష‌ణ‌ల్లోనూ నిజ‌ముంద‌ని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

AAP

సంబంధిత వార్తలు: