పాక్‌ సంచలన నిర్ణయం: ఇక మంచిరోజులొచ్చినట్టేనా..?

పాకిస్తాన్.. మన పొరుగు దేశం.. మన దాయాది దేశం.. మన దేశం నుంచి విడిపోయి.. మనతో పాటే స్వాతంత్ర్యం పొందిన దేశం.. కానీ.. ఆ తర్వాత రెండు దేశాల దారులు పూర్తిగా వేరయ్యాయి. ఇండియా మొదట్లో సోషలిజం వైపు మొగ్గింది. ఆ తర్వాత క్యాపిటలిజంతో కూడిన సామ్యవాదం, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్ దిశగా అడుగులు వేస్తూ.. ప్రస్తుతం ఈ దశలో ఉంది. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా ప్రపంచం మన్ననలు అందుకుంటోంది.

కానీ పాకిస్తాన్‌లో మొదటి నుంచి సైన్యం ప్రభావం ఎక్కువ. అక్కడ ప్రజాస్వామ్యం సైన్యం చేతిలో ఆటబొమ్మగా మారింది. సైన్యం చేతిలో పాలకులు కీలుబొమ్మలుగా మారారు. ఫలితంగా అభివృద్ధి కుంటుపడింది. అనేక విషయాల్లో వెనకబడిపోయింది. అమెరికా వంటి దేశాల సాయంపై ఆధాపడుతూ.. ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తున్న దేశంగా మిగిలిపోయింది. అలాంటి పాకిస్తాన్ కు ఇప్పుడు కాస్త మంచిరోజులు వస్తున్నాయా అన్న అనుమానం కలుగుతోంది. ఎందుకంటే.. ఇటీవల ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ రూపొందించిన జాతీయ భద్రతా విధానం.. తొలిసారి సైన్యం కంటే.. ఆర్థిక వ్యవస్థపై ఎక్కువగా దృష్టి సారించింది.
 
అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాక్ ఆర్థిక వ్యవస్థను ఉద్దీపన కలిగించేలా ఈ కొత్త జాతీయ భద్రతా విధానం రూపొందించారు. తొలిసారి పెట్టుబడుల ఆకర్షణకు ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే పాకిస్తాన్‌లో భారీగా పెట్టుబడి పెట్టే విదేశీయులకు శాశ్వత నివాసం కల్పిస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించారు. చైనా, అమెరికా వంది దేశాల నుంచి ఎవరు వచ్చి పాకిస్తాన్‌లో పెట్టుబడులు పెట్టినా వారికి శాశ్వత సభ్యత్వం ఇస్తామంటోంది ఆదేశం.

ఈ విధానంతో పెట్టుబడులను ఆకర్షించవచ్చని పాకిస్తాన్ భావిస్తోంది. ప్రత్యేకించి అమెరికాలోని సిక్కులు తప్పకుండా పాక్‌లో పెట్టుబడులు పెడతారని ఆశిస్తోంది. విదేశీయులకు పాక్‌ పౌరసత్వం ఇవ్వడం ద్వారార బిలియన్‌ డాలర్ల విదేశీ పెట్టుబడులు రాబట్టాలన్న పాక్‌ వ్యూహం ఫలిస్తుందా.. లేదా అన్నది కాలం నిర్ణయిస్తుంది. కానీ.. పాక్‌లో వచ్చిన  మార్పు మాత్రం ఆహ్వానించదగిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: