జగన్‌ ఎంతో కష్టపడి సెట్‌ చేస్తే.. మళ్లీ ఏందీ లొల్లి..?

ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యోగుల పీఆర్సీ అంశం ఇటీవలే కొలిక్కి వచ్చింది. ఫిట్‌మెంట్‌ను 23 శాతంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఐఆర్‌ యే 27 శాతం ఉంటే.. ఫిట్‌మెంట్ అంత కంటే తక్కువగా ఉంటే ఎలా అని ప్రశ్నించిన ఉద్యోగ సంఘాల నేతను క్రమంగా సీఎం జగన్ దారికి తెచ్చుకున్నారు. అలా దారికి తెచ్చుకునేందుకు జగన్‌కు చాలా రోజుల సమయం పట్టింది. మొదట్లో  సజ్జల స్థాయిలో చర్చలు కొన్నిరోజులు జరిగాయి. ఆ తర్వాత సీఎస్‌ స్థాయిలో చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఫైనల్‌ గా జగన్ దగ్గర చర్చలు జరిగాయి.

అబ్బే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంత బాగా లేదు.. అసలు ఈ సమయంలో పీఆర్‌సీ గురించి మాట్లాడుకోవడమే గొప్ప అంటూ జగన్ క్రమంగా ఉద్యోగులను దారి తెచ్చాడు.  ఫిట్‌మెంట్‌ ను ఐఆర్‌ కంటే తక్కువ ఇస్తే ఉద్యోగ సంఘాలు రచ్చ చేస్తాయని తెలుసు.. అందుకే అనూహ్యంగా ఉద్యోగ విరమణ వయ్సును మరో రెండేళ్లు పెంచేస్తూ వరం కురిపించేశాడు. అలాగే జగనన్న టౌన్‌షిప్‌లో ప్రభుత్వ ఉద్యోగులకు 10 శాతం కేటాయిస్తామన్నాడు. అది కూడా 20 శాతం రిబేటుతో ఇళ్ల స్థలం ఇస్తా అన్నాడు. అంతే కాదు.. పెండింగ్‌ డీఎలు అన్నీ కలిపి వచ్చే నెల జీతంతో ఇచ్చేస్తా అన్నాడు. దీంతో ఉద్యోగ సంఘాల నేతలు కన్విన్స్ అయ్యారు. 23 శాతం ఫిట్‌మెంట్‌కు ఒప్పుకుని వచ్చారు.

మొత్తానికి జగన్ ఉద్యోగ సంఘాల నేతలను బతిమాలో.. బెదిరించో.. వరాలిచ్చో.. ఎలాగోలా దారికి తెచ్చుకున్నాడు.. అయితే.. ఇంత తక్కువ ఫిట్‌మెంట్‌ ఏంటంటూ మళ్లీ కొందరు ఉద్యోగులు ఆందోళన ప్రారంభించారు. పీఆర్సీకి సంబంధించిన అంశాలపై ఏపీ  గెజిటెడ్ ఉద్యోగుల సంఘం అత్యవసర సమావేశం నిర్వహించుకుని.. ఫిట్మెంట్ అంశాన్ని పునః సమీక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇస్తున్న మధ్యంతర భృతి 27 శాతానికి తగ్గకుండా పీఆర్సీ ప్రకటించాలని గెజిటెడ్‌ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇంటి అద్దె భత్యం స్లాబ్స్ ను ప్రస్తుతం ఉన్న వాటినే కొనసాగించాలని ఏపీ గెజిటెడ్ ఉద్యోగుల సంఘం కోరుతోంది. నగరాల్లో ఖర్చులు విపరీతంగా పెరిగినందున సీసీఎను పెంచాలని ప్రభుత్వాన్ని అడుగుతోంది. సో.. మళ్లీ వ్యవహారం మొదటికి వస్తున్నట్టు కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: