గోవాలో పోటీ వెనుక మ‌మ‌త ల‌క్ష్యం అదేనా..?

త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పశ్చిమ‌బెంగాల్లో అధికారంలో ఉన్న మ‌మ‌తాబెన‌ర్జీ ఆధ్వ‌ర్యంలోని టీఎంసీ పార్టీ బ‌రిలోకి దిగ‌నుండ‌ట‌మేంటి..? ఇది సామాన్యుల‌కు మాత్ర‌మే కాదు.. రాజ‌కీయ విశ్లేష‌కుల‌కూ ఏమంత కొరుకుడు ప‌డ‌ని అంశ‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే గోవాలో ఇప్ప‌టిదాకా మ‌మ‌త పార్టీకి ఎలాంటి బ‌లం లేదు. భౌగోళికంగానూ బెంగాల్ తూర్పుతీర రాష్ట్రమైతే, గోవా ప‌శ్చిమ‌తీరంలో ఉంది. మ‌రి ఏ ర‌కంగానూ సామీప్య‌త లేని ఈ రాష్ట్ర ఎన్నిక‌ల గోదాలోకి మ‌మ‌త రావాల‌నుకోవ‌డం వెనుక వ్యూహ‌మేంటి..?  మ‌మ‌త స‌న్నిహిత వ‌ర్గాలు వ్య‌క్తంచేస్తున్న అభిప్రాయం ఏమిటంటే గోవాలో పోటీ చేయాల‌నుకోవ‌డం జాతీయ రాజ‌కీయాల‌వైపు దృష్టిసారించే ప్ర‌య‌త్నాల్లో భాగంగా మ‌మ‌త వేసుకుంటున్న ట్ర‌య‌ల్. ఇక్కడ తృణ‌మూల్ ఏమంత గొప్ప ఫ‌లితాలు సాధించ‌లేద‌న్న విష‌యం ఆమెకు కూడా తెలుసు. ఎందుకంటే అక్క‌డ ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న బీజేపీ బ‌లంగా ఉండ‌గా, కాంగ్రెస్‌, ఆమ్ఆద్మీ పార్టీలు ప్ర‌తిప‌క్ష స్థానం కోసం పోటీ ప‌డుతున్నాయి. అదే విష‌యాన్ని టీఎంసీ కూడా ప్ర‌చారంలో పేర్కొంటోంది. గోవాలో అధికారం ల‌క్ష్యం కాద‌ని, నీతివంత‌మైన రాజ‌కీయాల‌వైపు ప్ర‌జ‌ల‌ను న‌డిపించాల‌న్న‌దే త‌మ ల‌క్ష్య‌మ‌ని చెప్పుకుంటోంది.

అయితే ప‌శ్చిమ బెంగాల్ వంటి పెద్ద రాష్ట్రంలో మోదీషాల వ్యూహాల‌ను, బీజేపీని ఎదురొడ్డి నిలువ‌రించిన ఖ్యాతి ద‌క్కించుకున్నమ‌మ‌తకు జాతీయ స్థాయిలో విస్తృత స్థాయి ప్ర‌చారం ల‌భించిన విష‌యం తెలిసిందే. మోదీకి బెంగాల్ టైగ‌రే సిస‌లైన ప్ర‌త్య‌ర్థి కాగ‌ల‌ర‌న్న వాద‌న‌లూ తెర‌పైకి వ‌చ్చాయి. ఇప్పుడు మ‌మ‌త వాటిని నిజం చేస్తూ మోదీకి నిజంగా ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా ఎద‌గాలంటే ఇత‌ర రాష్ట్రాల్లోనూ త‌న పార్టీ ఉనికిని చాటుకోగ‌ల‌గాలి. అందుకే ఇప్ప‌టికే టీఎంసీ ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, త్రిపుర‌, మేఘాల‌య‌తో పాటు కీల‌క రాష్ట్ర‌మైన యూపీ పైనా క‌న్నేసింది. అంత‌కంటే ముందుగా ఇత‌ర రాష్ట్రాల ప్ర‌జ‌ల్లో త‌న‌కేపాటి అభిమానం ఉందో తెలుసుకోవాలి. అందుకే ప్ర‌యోగాత్మ‌కంగా టీఎంసీ గోవా ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోంది. ఇక్కడ ఎలాంటి ఫ‌లితం వ‌చ్చినా మ‌మ‌త‌కు వ‌చ్చే న‌ష్ట‌మేమీ ఉండ‌దు. 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న చిన్న రాష్ట్రం కాబ‌ట్టి జాతీయ స్థాయిలోనూ పెద్ద ప్ర‌భావం ఉండ‌దు. ఉంటే గింటే అధికార పార్టీ వ్య‌తిరేక ఓట్లు చీలి కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీల‌కు ఏమైనా న‌ష్టం జ‌ర‌గొచ్చు అంతే. ఒక‌ర‌కంగా అర‌వింద్ కేజ్రీవాల్ ఎదుగుద‌ల‌ను అడ్డుకోవ‌డం కూడా మ‌మ‌త వైఖ‌రికి కార‌ణం కావ‌చ్చ‌న్న విశ్లేష‌ణ‌లూ వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: