విప‌క్షాల అనైక్య‌తే బీజేపీకి బ‌ల‌మా..?

దేశ రాజ‌కీయాల్లో మొద‌టినుంచీ కొన‌సాగుతున్న ఆన‌వాయితీ ఏమిటంటే జాతీయ స్థాయిలో ఏదో ఒక రాజ‌కీయ పార్టీయే ప్రాబ‌ల్యం వ‌హిస్తూ ఉండ‌టం. దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన పార్టీగా గుర్తింపు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఈవిధంగానే 1947 నుంచి 1977 వ‌ర‌కు మూడు ద‌శాబ్దాల‌పాటు ఏక్ఛ‌త్రాధిప‌త్యంగా ఢిల్లీ పీఠాన్ని త‌న ఆధీనంలోనే ఉంచుకోగ‌లిగింది. అయితే నాటి ప్ర‌ధాని ఇందిరాగాంధీ త‌న‌కు రాజ‌కీయంగా ఎదుర‌వుతున్న స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ఏమర్జెన్సీ విధించ‌డం, ఆ కాలంలో విపక్ష‌నేత‌ల‌పై సాగించిన ద‌మ‌న‌కాండ ప్ర‌జ‌ల్లో తీవ్ర ఆగ్ర‌హావేశాల‌కు కార‌ణ‌మైంది. ఆ కార‌ణంగానే 1977లో జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర ప‌రాజ‌యం పాలైంది. దిగ్గ‌జ నాయ‌కులున్న జ‌న‌తా పార్టీ అఖండ మెజారిటీ సాధించింది. అంత‌కుముందు వ‌ర‌కు కేవ‌లం 35 ఎంపీ సీట్లు ఉన్న మాత్ర‌మే ఆ పార్టీ దేశ‌వ్యాప్తంగా 41.32 శాతం ఓట్లు సాధించి ఏకంగా 295 స్థానాల్లో విజ‌య దుందుభి మోగించింది. ఇక కాంగ్రెస్ పార్టీ 34.5 శాతం ఓట్ల‌కు ప‌రిమిత‌మై అంత‌కుముందున్న353 సీట్ల‌లో 198 కోల్పోయి 154 స్థానాల‌కు ప‌రిమిత‌మైంది. రాయ్‌బ‌రేలీ నుంచి పోటీ చేసిన ఇందిరాగాంధీ కూడా ఓట‌మిపాలయ్యారు. తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌ధానిగా మురార్జీదేశాయ్ ప్ర‌ధాని పీఠాన్ని అధిష్ఠించారు.
అయితే ఈ గెలుపును నాటి జ‌న‌తా పార్టీ నాయ‌కులు ఉప‌యోగించుకోలేక‌పోయారు. దానికి కార‌ణ‌మేమిటంటే ఆపార్టీలో దిగ్గ‌జ‌ల్లాంటి నాయ‌కుల సంఖ్య ఎక్కువ‌గా ఉండ‌టం. వారిలో లుక‌లుక‌లు రావ‌డం. స‌రిగ్గా ఈ అంశాన్నే ఉప‌యోగించుకుని ఇందిర త‌న రాజ‌కీయ చాణ‌క్యాన్ని ప్ర‌ద‌ర్శించి జ‌న‌తా పార్టీలో చీలిక తెచ్చి మురార్జీ స్థానంలో చ‌ర‌ణ్‌సింగ్ ప్ర‌ధాని కావ‌డానికి స‌హ‌క‌రించ‌డం ఆ త‌రువాత కొద్ది నెల‌లకే ఆ ప్రభుత్వాన్ని కూడా గ‌ద్దెదించి తాను తిరిగి ప్ర‌ధాని పీఠాన్ని ద‌క్కించుకోవ‌డం చ‌రిత్ర‌. ఈ ప‌రిణామాల కార‌ణంగానే విప‌క్షాలు మ‌ళ్లీ ప‌దేళ్ల‌వ‌ర‌కు ఢిల్లీ పీఠం వైపు క‌న్నెత్తి చూడ‌లేక‌పోయాయి. ఆ త‌రువాత కాంగ్రెస్‌, బీజేపీయేత‌ర ప‌క్షాల‌న్నీ క‌లిపి ఏర్పాటు చేసిన సంకీర్ణ ప్ర‌భుత్వాలేవీ కూడా విజ‌య‌వంత కాలేద‌నే చెప్పాలి. 1999లో బీజేపీ నేతృత్వంలో ఏర్ప‌డిన ఎన్డీఏ కూట‌మి మాత్రం విజ‌య‌వంత‌మైంది. దీనికి కార‌ణం దిగ్గ‌జ నాయ‌కుడు అట‌ల్ బిహారీ వాజ్‌పేయి. పూర్తికాలం అధికారంలో ఉన్న తొలి కాంగ్రెసేత‌ర ప్ర‌ధాని ఆయ‌న.
ఆ త‌రువాత 2014 ఎన్నిక‌ల‌నాటికి బీజేపీ పూర్తిస్థాయి మెజారిటీ సాధించి ఒక‌నాటి కాంగ్రెస్ పార్టీ స్థానాన్ని ఆక్ర‌మంచింది. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించేందుకు ప్రణాళిక‌లు ర‌చిస్తోంది. ఆ పార్టీని అధికార పీఠం నుంచి దించేందుకు ప్ర‌య‌త్నిస్తున్న విప‌క్షాలు మాత్రం గ‌త చ‌రిత్ర నుంచి గుణ‌పాఠాలు నేర్చుకున్న దాఖ‌లాలు ఏమీ కనిపించ‌డంలేద‌న్న‌ది రాజ‌కీయ విశ్లేష‌కుల మాట‌. ఎస్పీ, బీఎస్పీ, టీఎంసీ, ఆప్ త‌దిత‌ర పార్టీల‌న్నీ సొంత‌బాట‌లోనే సాగుతున్న విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో దేశంలో బ‌లంగా వేళ్లూనుకున్న బీజేపీ ప్రాబ‌ల్యాన్ని ఎదిరించి నిలువ‌రించేందుకు క‌లిసిక‌ట్టుగా నిల‌వాల్సిన విప‌క్షాలు ఎవ‌రికి వారే య‌మునాతీరే అన్న‌ట్టుగా సాగుతుండ‌టం, ప్ర‌ధాని పీఠానికి తామే అర్హుల‌మ‌ని భావిస్తూ ఉండ‌టం ప్ర‌స్తుతం క‌నిపిస్తున్న రాజ‌కీయ ముఖచిత్రం. బీజేపీకి వీరు ఎంత‌వ‌ర‌కు ప్ర‌త్యామ్నాయం కాగ‌ల‌ర‌న్న‌ది ప్ర‌శ్నార్థ‌క‌మేన‌న్న అభిప్రాయాలే స‌ర్వ‌త్రా విన‌వ‌స్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: