శభాష్‌ కేసీఆర్.. మనసున్న మారాజువయ్యా..?

కేసీఆర్‌.. కొన్నిసార్లు తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయాలు అద్భుతంగా ఉంటాయి. ఇలాంటి మంచి ఆలోచనలు ఈయనకే వస్తాయా అన్నంతగా ఉంటాయి. రైతుకు నేరుగా ధన సాయం చేయాలన్న ఆలోచనకానీ.. ఒంటరి మహిళలను ఆదుకోవాలన్న ఆలోచన.. ఆడపిల్ల పెళ్లికి సాయం చేయాలన్న ఆలోచన.. ఇలా ఒక్కొక్కటి ఒక్కో ప్రత్యేకత ఉంది. ఇక ఇప్పడు ఆయన అనాథ పిల్లల విషయంలో తీసుకున్న నిర్ణయం కూడా మానవత్వ పరిమళాలు వెదజల్లుతోంది.

ఆయన అనాథ పిల్లలను రాష్ట్ర బిడ్డలుగా ప్రకటించారు. ఇకపై వారికి ప్రత్యేకంగా స్మార్ట్‌ ఐడీ కార్డులు ఇవ్వాలని నిర్ణయించారు. ఈ మేరకు కేసీఆర్ సర్కారు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులు చేసింది. అనాథ పిల్లలందరినీ రాష్ట్ర బిడ్డలుగా గుర్తిస్తే.. వారి బాధ్యతను ఇక ప్రభుత్వమే తీసుకుంటుందన్నమాట. ప్రభుత్వమే తల్లిదండ్రులుగా బాధ్యతలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. అంతే కాదు.. అనాథ పిల్లల సంరక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని నిర్ణయించింది.

అనాథలను అడ్డు పెట్టుకుని వ్యాపారం చేసే వారిపైనా ఇక ముందు కఠిన చర్యలు తీసుకుంటారు. అలాంటి వారిపై పీడీ యాక్టు కింద కేసులు నమోదు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. అనాథలను రాష్ట్ర బిడ్డలుగా గుర్తించడం వల్ల ఏం జరుగుతుందంటే.. వారికి కేజీ నుంచి పీజీ వరకు గురుకులాల తరహాలో ప్రత్యేక ప్రాంగణాలు ఏర్పాటు చేస్తారు. జీవితంలో స్థిరపడేలా ఉపాధి కల్పించే ప్రయత్నం చేస్తారు. రోడ్లపై భిక్షాటన చేసే అనాథలకు ప్రత్యేక పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేస్తారు.

ఇకపై అనాథ పిల్లలకు స్మార్ట్‌ ఐడీ కార్డులు ఇస్తారు. ఈ కార్డుల ద్వారా ఆదాయ ధ్రువీకరణ, కులధ్రువీకరణ పత్రాల నుంచి మినహాయింపు లభిస్తుంది. అనాథ పిల్లల కోసం ప్రస్తుతం నడుస్తున్న శరణాలయాలను ప్రభుత్వ పరిధిలోకి తీసుకొస్తారు. వాటికి ప్రభుత్వం అండగా నిలుస్తుంది. వీరి కోసం ఖర్చుచేసే నిధులు మిగిలితే వచ్చే ఏడాదికి మళ్లిస్తారు.  కార్పొరేట్‌ సామాజిక బాధ్యత కింద సాయం కోసం ముందుకొచ్చేవారికి ప్రత్యేక గౌరవం, గుర్తింపు ఇస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: